టీఆర్ఎస్ పార్టీ అధినేత‌, తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ అంటే..ఆ పార్టీలో స‌ర్వ‌స్వం. బ‌య‌ట ఇర‌కాటంగా మారుతున్న అంశాలైనా...బాస్ ముందు చెప్పేందుకు గులాబీ నేత‌లు భ‌య‌ప‌డుతారు. తెలంగాణలో ఉధృతంగా సాగుతున్న ఆర్టీసీ సమ్మె దీనికి నిద‌ర్శ‌నం. మొదట్లో ఒకరిద్దరు నేత‌లు సమ్మెపై స్పందించినా...ఆ తర్వాత కామ్ అయిపోయారు. సమ్మెపై స్పందిస్తే ఎక్కడ బాస్ ఆగ్రహానికి గురికావాల్సి వస్తుందోనన్న భయంతో అందరూ సైలెంట్ అయిపోయిన త‌రుణంలో... టీఆర్ఎస్ పార్టీకి చెందిన‌ రాజ్యసభ సభ్యుడు ధర్మపురి శ్రీనివాస్ సీఎంను కెలికారు. ఆర్టీసీ సమ్మెపై ముఖ్యమంత్రి కేసీఆర్‌కు లేఖ రాసి...తానెంటో, త‌న స‌త్తా ఏంటో చూపించారు.


ఆర్టీసీ కార్మికుల విష‌యంలో సీఎం కేసీఆర్‌ తీరు వెనుక ఏదో కుట్ర ఉంద‌ని...ఆయ‌న్ను ఉద్దేశించి రాసిన లేఖ‌లోనే...డీఎస్ పేర్కొన్నారు. ‘‘ఆర్టీసీ విషయంలో పంతాలకు, పట్టింపులకు పోవద్దు. కార్మికులతో వెంటనే చర్చలు జరిపి సమ్మెకు ముగింపు పలకండి” అని సీఎం కేసీఆర్​ను కోరారు. ``ఆర్టీసీ కార్మికుల‌ సమ్మె తెలంగాణ ఉద్యమాన్ని గుర్తు చేస్తోంది. కార్మికుల ఆత్మహత్యలకు బాధ్యులైన వారిపై గుండె రగులుతోంది. కార్మికుల్లో తెలంగాణ శౌర్యం కనిపిస్తోంది. చర్చలతో వివాదానికి ముగింపు పలకండి`` అని సూచించారు.


డీఎస్ తనయుడు ధర్మపురి అరవింద్ బీజేపీలో చేరడంతో పాటు అప్పటి సిట్టింగ్ ఎంపీ కవితపై విమర్శలు గుప్పించి అనంత‌రం ఎన్నిక‌ల్లో ఆమెను ఓడించారు. అనంత‌రం, నిజామాబాద్ అసెంబ్లీ ఎన్నికల్లో డీఎస్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేశారంటూ మాజీ ఎంపీ కవిత నేతృత్వంలో ఆ జిల్లా నేతలు గులాబీ పార్టీ అధిష్టానానికి లేఖ రాశారు. డీఎస్‌పై వెంటనే చర్యలు తీసుకోవాలని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను కోరారు. అయితే ఆ అంశంపై ఏ నిర్ణయం తీసుకోకుండా టీఆర్‌ఎస్‌ అధినేత పెండింగ్‌లో పెట్టారు. సమయం చూసి.. డీఎస్‌పై అనర్హత వేటు వేయాలని గులాబీ పార్టీ పెద్దలు భావిస్తున్న తరుణంలోనే ఆర్టీసీ సమ్మెపై ముఖ్యమంత్రికి ఆయన లేఖ రాయడం ద్వారా రాజకీయ చెలగాటం మొదలుపెట్టారని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే, ఇంత జ‌రుగుతున్నా....ఉప‌ముఖ్య‌మంత్రి ప‌ద‌విలో నుంచి సీనియ‌ర్, ద‌ళిత నేత‌ను హఠాత్తుగా ఊడ‌బీకిన గులాబీ ద‌ళ‌ప‌తి...డీఎస్ విష‌యంలో చ‌ర్య‌లు తీసుకోలేక‌పోతున్నార‌నేది నిందా?నిజ‌మా? అనేది ...గులాబీ వ‌ర్గాలే స‌మాధానం ఇవ్వాల్సిన అంశం.


మరింత సమాచారం తెలుసుకోండి: