ఏపీ అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యేల స్థానాలు ఎక్కడ ఉంటాయి? అదేంటి అసలు ఏపీలో బీజేపీకి ఒక్క ఎమ్మెల్యే కూడా లేడు. వారికి మళ్ళీ అసెంబ్లీ స్థానాలు ఏంటని అనుకుంటున్నారా?  అయితే అసలు కథ ఇప్పుడే మొదలు కాబోతుంది చూడండి. ఏపీలో తాజాగా జరుగుతున్న రాజకీయ పరిణామాలని చూస్తుంటే అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యేలు ఖచ్చితంగా ఉంటారని అర్ధమవుతుంది. ఇప్పటికే ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో నలుగురు రాజ్యసభ సభ్యులని, అనేకమంది నేతలని తమ పార్టీలోకి లాగేసిన బీజేపీ..ఇప్పుడు టీడీపీ ఎమ్మెల్యేలపై కన్నేసింది.


అందులో భాగంగానే కొందరు టీడీపీ ఎమ్మెల్యేలని పార్టీలోకి తీసుకోవాలని చూస్తుంది. ఇప్పటికే గంటా శ్రీనివాసరావుతో చర్చలు చేసిన బీజేపీ, ఆయన్ని త్వరలోనే బీజేపీలోకి చేర్చుకోనున్నారు. ఆయనతో పాటు మరికొందరు కూడా బీజేపీలోకి వస్తారని తెలుస్తోంది. అందులో విశాఖలో గంటాతో పాటు ఒకరు. గుంటూరు, ప్రకాశం జిల్లాల నుంచి ఒకరు బీజేపీలో చేరతారని పోలిటికల్ వర్గాల్లో చర్చ నడుస్తోంది.


అయితే వీరేగాక మరికొందరు కూడా బీజేపీలో చేరే అవకాశముందని తెలుస్తోంది. అటు వైసీపీ వైపు వల్లభనేని వంశీ ఇప్పటికే వెళ్లారు. మరికొందరు కూడా వైసీపీ వైపు వెళ్ళే అవకాశముంది. అయితే వైసీపీలోకి వెళ్ళేవారు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వెళ్ళాలి. కానీ బీజేపీలోకి వెళ్ళేవారు అలా చేస్తారా? అంటే కష్టమే. అలా అని స్పీకర్ వారిపై వేటు వేస్తారా? అంటే కూడా చెప్పలేం. ఎందుకంటే వైసీపీకి...కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చాలాపని ఉంది కాబట్టి బీజేపీలోకి వెళ్ళేవాళ్లని స్పీకర్ ఏం చేయకపోవచ్చు. ఇటు బీజేపీతో నడవాలని టీడీపీ చంద్రబాబు కూడా ఎప్పటి నుంచో చూస్తున్నారు.


అందుకే రాజ్యసభ సభ్యులని విలీనం చేసుకున్న బాబు ఏం మాట్లాడలేదు. ఇప్పుడు ఎమ్మెల్యేలు వెళ్ళిన అంతే. కాబట్టి ఏపీలో బీజేపీకు ఎమ్మెల్యేలు ఉండనున్నారు. వారికి అసెంబ్లీలో చోటు దక్కనుంది. ఇక డిసెంబర్ 2 నుంచి శీతాకాల సమావేశాలు జరగనున్నాయి. ఈలోపు ఎమ్మెల్యే కూడా లైన్ క్లియర్ చేసుకుంటే... శీతాకాల అసెంబ్లీ సమావేశాల్లో బీజేపీ ఎమ్మెల్యేలు ఉంటారు. మరి స్పీకర్ వారికి అసెంబ్లీలో ఎక్కడ సీట్లు కేటాయిస్తారో చూడాలి.  


మరింత సమాచారం తెలుసుకోండి: