ప‌క్క‌ప‌క్క‌నే ఉన్న రెండు రాష్ట్రాల్లోని ప‌రిస్థితికి ఇది నిద‌ర్శ‌నం. కీల‌క‌మైన అంశంలో...తెలుగు రాష్ట్రాల‌ ప‌దేళ్ల ఉమ్మ‌డి రాజ‌ధాని హైద‌రాబాద్ టాప్‌లో ఉండ‌గా...ఆంధ్రుల రాజ‌ధాని అమ‌రావ‌తి అట్ట‌డుగున ఉంది. కేంద్ర ప్రభుత్వం ఆధ్వ‌ర్యంలోని బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) దేశంలోని 21 మ‌హా నగరాల్లో జరిపిన అధ్యయనంలో హైదరాబాద్ నగరంలో ఇళ్ల‌కు నల్లాల ద్వారా జలమండలి సరఫరాచేస్తున్న మంచినీరు సురక్షితమైనదని కితాబిచ్చింది.  ముంబై మహానగరం తర్వాత సురక్షితమైన తాగునీటిని సరఫరాచేస్తున్న నగరంగా హైదరాబాద్ రెండోస్థానం దక్కించుకుంది. ఆరు శాంపిళ్లలో అమరావతి విఫలమైంది.


కేంద్ర ఆహార, ప్రజాపంపిణీ, వినియోగదారుల వ్యవహారాలశాఖ మంత్రి రాంవిలాస్‌పాశ్వాన్ ఆదివారం బీఐఎస్ నివేదికను విడుదల చేశారు. ఒక్కో నగరం నుంచి 10 శాంపిల్స్ సేకరించి 28 రకాల ప్రమాణాలపై పరీక్షలను నిర్వహించినట్లు పాశ్వాన్ వెల్లడించారు. ముంబైలో పది శాంపిల్స్‌లోనూ అన్ని ప్రమాణాలకు సంబంధించి సత్ఫలితాలు వచ్చాయని, హైదరాబాద్‌లో 9 శాంపిల్స్ అన్ని ప్రమాణాల మేరకు పరీక్షకు నిలబడ్డాయని పేర్కొన్నారు. హైదరాబాద్‌తో పాటు భువనేశ్వర్, రాంచీ.. పది శాంపిళ్లలో ఒక్కో శాంపిల్‌లో విఫలం కాగా, రాయ్‌పూర్ ఐదు, ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతినుంచి సేకరించిన పది శాంపిళ్లలో ఆరు ఫెయిలయ్యాయని చెప్పారు. సిమ్లాలో ఏకంగా పది శాంపిళ్లలో 9 శాంపిళ్లు పరీక్షలో విఫలమయ్యాయని పాశ్వాన్ తెలిపారు. దాదాపు 13 రాష్ర్టాల రాజధానుల్లో (చండీగఢ్, తిరువనంతపురం, పాట్నా, భోపాల్, గువాహటి, బెంగళూరు, గాంధీనగర్, లక్నో, జమ్ము, జైపూర్, డెహ్రాడూన్, చెన్నై, కోల్‌కతా) నగరాల్లో సేకరించిన శాంపిళ్లలో ఒక్క శాంపిల్ కూడా బీఐఎస్ ప్రమాణాల మేరకు లేవన్నారు. ఈ పరీక్షలు ఏ ఒక్కరినో తక్కువచేయడానికి కాదని.. ప్రజలందరికీ సురక్షితమైన నీటిని అందించడంపై రాష్ర్టాలను ప్రోత్సహించడంకోసమేనని పాశ్వాన్ స్పష్టంచేశారు.


నీటినాణ్యత విషయంలో ఎక్కడా రాజీపడకుండా పనిచేస్తున్నామ‌ని జలమండలి మేనేజింగ్ డైరెక్టర్  దానకిశోర్ తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్ ప్రజలకు సురక్షిత నీటిని అందించడంకోసం అవసరమైన అన్ని చర్యలు చేపడుతున్నామ‌ని, సంస్థతోపాటు ఐపీఎం లాంటి సంస్థలు రోజూ నీటిశాంపిల్స్ సేకరిస్తూ పరీక్షలు నిర్వహిస్తున్నాయని వెల్ల‌డించారు. ఇప్పటికే నీటి నాణ్యత విషయంలో ఐఎస్వో సర్టిఫికెట్‌ను సాధించామ‌ని తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: