మోడీ అంటే గిట్టని వారు మొండి అంటారు. ఆయన ఒకసారి ఏదైనా అనుకుంటే వెనక్కు మళ్ళరు. అది ఎవరూ చెప్పనక్కర‌లేదు, ఆయన అయిదేళ్ళ పాలన చూస్తే అర్ధమవుతుంది.  మోడీ ఎవరో పొరుగున ఉన్న దాయాది పాకిస్థాన్ కి అర్ధమైనది దేశంలోని రాజకీయ ప్రత్యర్ధులకు అర్ధం కాలేదనుకుంటే పొరపాటే. మోడీ జాతీయ రాజకీయాల్లోకి రాకముందు దేశ రాజకీయ తెర మీద ఎన్నో పార్టీలు, ఎన్నో గొంతులు వినిపించేవి.


మరిపుడు ఏమైంది. మోడీ ఒక్కరే శాసిస్తున్నారు. ఆయన ఎస్ అంటే ఎస్ అంటున్నారు. నో అంటే ఇక అప్పీలే లేదు. వందేళ్ళ పై బడిన పార్టీ కాంగ్రెస్ పరిస్థితి చూసుకుంటేనే దారుణంగా ఉంది. మిగిలిన పార్టీల విషయం అసలు చెప్పనక్కరలేదు. ఇవన్నీ ఇలా ఉంటే ఏపీకి ప్రత్యేక హోదా గత ఆరేళ్ళుగా కేంద్రం బాకీ పడింది. హోదా విషయంలో నో అంటూనే ఏపీలో బలపడాలని బీజేపీ చూడడం కచ్చితంగా రాజకీయ దబాయింపే.


మరి దీన్ని ఎదుర్కోవాలంటే ఏపీలోని రాజకీయ పార్టీలు సిధ్ధంగా ఉన్నాయా అంటే లేవు అని చెప్పాలి. చంద్రబాబు ఎన్నికల్లో ఓడిపోయాక పూర్తిగా బీజేపీకి  సరెండర్ అయ్యేలా వ్యవహరిస్తున్నారు. ఆయన హోదా ఎందుకు ఇవ్వరు అని ఎన్నికల ముందు గద్దించారు. ఇపుడు అసలు మాట్లాడడంలేదు. ఇక వామపక్షాలు మాత్రమే ఏపీలో హోదా విషయంపై మాట్లాడుతున్నాయి.


ఇపుడు అధికార వైసీపీ ప్రత్యేక హోదాని వదలదలచుకోలేదు. ఎట్టి పరిస్థితిలో హోదా ఏపీకి ఇవ్వాలన్నదే జగన్ విధానంగా ఉంది. అఖిల పక్ష సమావేశంలో ఇదే విషయమై విజయసాయిరెడ్డి, మిధున్ రెడ్డి గట్టిగానే  కేంద్రాన్ని నిలదీశారు. రేపటి సభలో ఇదే విషయాన్ని వారు ప్రస్తావించే అవకాశాలు కూడా ఉన్నాయి. ఓ విధంగా హోదా అంటే  మోడీని కెలకడమే. మరి జగన్ దీనికి సిధ్ధపడుతున్నారనే అనుకోవాలేమో. చూడాలి ఏం జరుగుతుందో.



మరింత సమాచారం తెలుసుకోండి: