ఆర్టీసీ కార్మికుల సమ్మె 45వ రోజుకు చేరింది. ఆర్టీసీ జేఏసీ నేతలు అశ్వత్థామరెడ్డి, రాజిరెడ్డి చేస్తున్న దీక్షను పోలీసులు భగ్నం చేసి  నిన్న వారిని ఆస్పత్రికి తరలించారు. బలవంతంగా అశ్వత్థామరెడ్డి, రాజిరెడ్డిలకు  వైద్యులు ఫ్లూయిడ్స్ ఎకిస్తున్నారని సమాచారం. దీక్ష భగ్నం అయినప్పటికీ వెనక్కు తగ్గేది లేదని అశ్వత్థామరెడ్డి, రాజిరెడ్డి చెబుతున్నారు. ఆర్టీసీ కార్మికులు చట్ట విరుద్ధంగా సమ్మె చేస్తున్నారని ఆర్టీసీ ఇంఛార్జీ ఎండీ సునీల్ శర్మ శనివారం అఫిడవిట్  దాఖలు చేశారు. 
 
ఆర్టీసీ కార్మికుల సమ్మె వలన పండుగ సమయంలో ఆర్టీసీకి చాలా నష్టం జరిగిందని ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులను తిరిగి విధుల్లోకి చేర్చుకునే ప్రసక్తి లేదని సునీల్ శర్మ అఫిడవిట్ లో పేర్కొన్నారు. ఆర్టీసీ జేఏసీ నాయకులు కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయబోతున్నామని చెబుతున్నారు. ప్రైవేటీకరణకు సంబంధించిన అఫిడవిట్ కూడా కోర్టులో దాఖలైంది. కేబినేట్ ప్రైవేటీకరణకు ఆమోదం తెలిపిందని అఫిడవిట్ లో పేర్కొన్నట్లు తెలుస్తోంది. 
 
కోదండరాం ఈరోజు భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తామని చెబుతున్నారు. ఆర్టీసీ సమ్మె, రూట్ల ప్రైవేటీకరణపై ఈరోజు హైకోర్టులో విచారణ జరగబోతుంది. ఆర్టీసీ సమ్మె, ఉద్యోగాల నుండి కార్మికుల తొలగింపుపై ఈరోజు హైకోర్టులో వాదనలు కొనసాగనున్నాయి. ప్రభుత్వం ఎస్మా చట్టం ప్రకారం కార్మికులను తొలగించామని వాదిస్తోంది. శనివారం సునీల్ శర్మ సమర్పించిన అఫిడవిట్ గురించి కూడా ఈరోజు చర్చకు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. 
 
రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ కార్మికుల నిరసనలు కొనసాగుతున్నాయి.  5,100 రూట్లను ప్రైవేటీకరిస్తూ ఇటీవలే కేబినేట్ తీసుకొన్న నిర్ణయంపై పిటిషన్ దాఖలైంది. సునీల్ శర్మ ఇంకా నిర్ణయం అమలులోకి రాలేదని శనివారం రోజున కోర్టుకు తెలిపారు. రాజ్యాంగపరిధికి లోబడి కేబినేట్ ఈ నిర్ణయం తీసుకుందని సునీల్ శర్మ కోర్టుకు తెలిపారు. ప్రభుత్వం ప్రైవేటీకరణ పిటిషన్ ను కొట్టివేయాలని కోరగా హైకోర్టు ఎలా స్పందిస్తుందో చూడాల్సి ఉంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: