అఖిలపక్ష సందర్భంగా జరిగిన సమావేశంలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా వైసిపి రాజ్యసభ ఎంపి విజయసాయిరెడ్డిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారని ప్రచారం చేసుకుని టిడిపి శునకానందం పొందుతోంది. విజయసాయి జోక్యంపై అమిత్ షా తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేశారని చెబుతోంది. ఇంతకీ విషయం ఏమిటంటే పార్లమెంటు సమావేశాల్లో కొందరు ఎంపిలకు పాల్గొనే అవకాశాలు కల్పించాలని కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రి నరేంద్రమోడి, అమిత్ షాలను కోరిందట.

 

జమ్మూ-కాశ్మీర్ పరిస్దితుల దృష్ణ్యా గృహనిర్బంధంలో ఉన్న మాజీ సిఎం, ఎంపి ఫరూక్ అబ్దుల్లాతో పాటు జైల్లో ఉన్న చిదంబరాన్ని కూడా పార్లమెంటు సమావేశాలకు హాజరయ్యే అవకాశాలు కల్పించాలని కాంగ్రెస్ నేత గులాంనబీ ఆజాద్ కోరారట.  దానికి వెంటనే అదే సమావేశంలో ఉన్న వైసిపి ఎంపి విజయసాయిరెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారట. తమ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని యూపిఏ ప్రభుత్వం అక్రమంగా 16 మాసాలు జైల్లె పెట్టిన విషయాన్ని ప్రస్తావించారట.

 

అప్పట్లో ఎంపిగా ఉన్న జగన్ ను జైల్లో పెట్టి పార్లమెంటు సమావేశాలకు హాజరయ్యే అవకాశాన్ని యూపిఏ ప్రభుత్వం కల్సించని విషయాన్ని గుర్తుచేశారట. అప్పట్లో జగన్ కు కల్పించని అవకాశాన్ని ఇపుడు చిదంబరానికి కూడా కల్పించకూడదని విజయసాయి చెప్పారట. ఈ విషయం మీదే విజయసాయిపై అమిత్ షా తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేశారని టిడిపి ఎంపి కనకమేడల రవీంద్ర చెప్పారు. కాంగ్రెస్ వాళ్ళ డిమాండ్ ఏదో వాళ్ళు చేస్తుంటే మధ్యలో మీ జోక్యం ఏమిటంటూ షా వైసిపి ఎంపిని కసరుకున్నట్లు రవీంద్ర చెప్పారు.

 

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే విజయసాయి జోక్యం చేసుకున్నారు. అమిత్ షా జోక్యాన్ని ఖండించారు. తర్వాత మందలించారు. అంతా బాగానే ఉంది. ఈ విషయం చెబితే అమిత్ షా చెప్పాలి లేకపోతే విజయసాయన్నా చెప్పాలి. ఎంపి ఎలాగూ చెప్పరు కాబట్టి అమిత్ షా చెబితే అర్ధముంది. మధ్యలో టిడిపికి ఎందుకంత అత్యుత్సాహం. అమిత్ వైసిపి ఎంపిని మందలిస్తే టిడిపికి ఎందుకు శునకానందమో అర్ధం కావటం లేదు?


మరింత సమాచారం తెలుసుకోండి: