తెలంగాణ‌లో ఆర్టీసీ స‌మ్మె ఉధృతం రూపం దాల్చుతోంది. ఆర్టీసీ జేఏసీ నేతలు చేస్తున్న నిరాహార దీక్షలు, వారికి మద్దతుగా ఎమ్మార్పీఎస్​ ఇందిరాపార్కు వద్ద తలపెట్టిన ‘సబ్బండ వర్ణాల మహా దీక్ష’లో ఉద్రిక్త‌త నెల‌కొంది. ఇందిరాపార్క్​ప్రాంతాన్ని పోలీసులు, ముళ్ల కంచెలు, బారికేడ్లతో దిగ్బంధం చేశారు. రోడ్లను మూసేసి స్థానికులను కూడా వెళ్లనివ్వలేదు. జేఏసీ కన్వీనర్​ అశ్వత్థామరెడ్డి, కో–కన్వీనర్​ రాజిరెడ్డిని, మహిళా కార్మికులను అరెస్టు చేశారు. అటు మంద కృష్ణను, ఎమ్మార్పీఎస్​ నేతలనూ అదుపులోకి తీసుకున్నారు.  


ఇదిలాఉండ‌గా, మ‌రోవైపు,  తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఇర‌కాటంలో పెట్టేందుకు ఆర్టీసీ కార్మికులు గ‌తంలో ఆయ‌న ఇచ్చిన హామీల‌ను గుర్తు చేస్తున్నారు. ఈమేర‌కు వివిధ మాధ్య‌మాల్లో వ‌చ్చిన వార్త‌ల‌ను సోష‌ల్ మీడియాలో ప్ర‌చారంలో పెడుతున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప‌గ్గాలు చేప‌ట్టిన అనంత‌రం 2014 నవంబర్ 29న నిర్వ‌హించిన స‌మావేశంలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ...ఎట్టిపరిస్థితుల్లోనూ TSRTCని ప్రైవేట్ పరం చేయనని ప్ర‌క‌టించడాన్ని ఈనాడు ప‌త్రిక ప్ర‌చురించింది. ఈ మేర‌కు 30,నవంబర్,2014న ప్రచురిత‌మైన వార్త‌ను సోష‌ల్ మీడియాలో పెట్టిన కార్మికులు...మాట త‌ప్ప‌డంపై కేసీఆర్ ఆలోచించుకోవాల‌ని కోరుతున్నారు. కాగా, కార్మికులు సోష‌ల్ మీడియా కేంద్రంగా చేస్తున్న కేసీఆర్ వ్య‌తిరేక ప్ర‌చారం ప్ర‌స్తుతం హాట్ టాపిక్‌గా మారింది.


ఇదిలాఉండ‌గా, ఆర్టీసీ సమ్మెకు సంబంధించి సర్కారు శనివారం హైకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్ పై కౌంటర్ దాఖలు చేయొద్దని జేఏసీ నిర్ణయించినట్టు తెలుస్తోంది. సర్కారు అఫిడవిట్​పై కౌంటర్ దాఖలు చేయాలని తొలుత భావించినా.. త‌మ లాయర్​ సూచనతో నిర్ణయం మార్చుకున్నట్టు జేఏసీ నేతలు తెలిపారు. ప్రభుత్వం తరఫు నుంచి అఫిడవిట్ వద్దని సీజే కొద్దిరోజుల కిందే స్పష్టం చేశారని, అయినా సర్కారు అఫిడవిట్​ దాఖలు చేసిందని న్యాయవాది చెప్పారని వివరించారు. ప్రభుత్వ అఫిడవిట్ ను సీజే అంగీకరించకపోవచ్చని, దానిపై విచారణలో దీటుగా వాదనలు వినిపిస్తానని భరోసా ఇచ్చారని చెప్పారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: