ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం రాజధాని గురించి చర్చ జరుగుతోంది. రాజధాని అధ్యయన కమిటీ అయిన జీఎన్ రావు కమిటీ కర్నూలు ఎయిర్ పోర్టు సమీపంలో భూములు సిద్ధం చేయాలని కర్నూలు జిల్లా అధికారులకు సూచనలు చేసినట్లు తెలుస్తోంది. కమిటీ హైకోర్టు లేదా రాజధానికోసమే భూములను సిద్ధం చేయమని చెప్పి ఉండవచ్చని కర్నూలు జిల్లా ప్రజల్లో చర్చ జరుగుతోంది. కమిటీ ఓర్వకల్లు ఎయిర్ పోర్టు నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని, శాశ్వత తాగునీటి సరఫరా ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించింది. 
 
కర్నూలులో పర్యటన తరువాత అనంతపురంలో పర్యటించిన కమిటీకి రాయలసీమ విద్యార్థి సంఘాల సెగ తగిలింది. విద్యార్థి సంఘాల నేతలు సమావేశం ముగించుకొని కమిటీ సభ్యులు వెళుతున్న సమయంలో కమిటీ సభ్యుల ముందు నినాదాలు చేశారు. శ్రీబాగ్ ఒప్పందాలను వెంటనే అమలు చేయాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. విద్యార్థి సంఘాలు రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయటంతో పాటు రాజధాని విషయంలో కూడా న్యాయం చేయాలని కమిటీని కోరాయి. 
 
రాయలసీమ ప్రజలు శ్రీబాగ్ ఒప్పందం అమలు చేయాలని, రాజధానిని, హైకోర్టును రాయలసీమలో ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నారు. జీఎన్ రావు కమిటీ ఎందుకోసం భూములను సిద్ధం చేయాలని కోరిందో తెలియటం లేదని హైకోర్టు లేదా రాజధాని కోసం భూములు సిద్ధం చేయాలని కోరి ఉండవచ్చని కర్నూలు జిల్లా ప్రజలు చెబుతున్నారు. సీఎం జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత రాజధాని అధ్యయనం కొరకు ప్రభుత్వం రిటైర్డ్ ఐఏఎస్ అధికారి జీఎన్ రావు నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేసింది. 
 
ఈ కమిటీ 14రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాల్సి ఉంది. జీఎన్ రావు కమిటీ కర్నూలు జిల్లా అధికారులకు చేసిన సూచనలను విద్యార్థి సంఘాలు స్వాగతిస్తున్నాయి. కర్నూలు జిల్లాకు రాజధాని లేదా హైకోర్టు వచ్చినా అవి న్యాయంగా శ్రీభాగ్ ఒప్పందం ప్రకారం కర్నూలుకే రావాలని విద్యార్థి సంఘాలు చెబుతున్నాయి. కర్నూలులోని పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయాలని రైతులకు తగిన న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కర్నూలు జిల్లా విద్యార్థి సంఘాల నాయకులు కోరుతున్నారు. 
 
 



మరింత సమాచారం తెలుసుకోండి: