ఆర్టీసీ సమ్మె పై హైకోర్టు నేడు కీలక తీర్పు వెలువరించే ఛాన్స్ ఉంది . ఆర్టీసీ కార్మికులు తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ , గత 45 రోజులుగా సమ్మె చేస్తున్న విషయం తెల్సిందే . చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించాలని హైకోర్టు సూచించినా  , రాష్ట్ర ప్రభుత్వం ఖాతరు చేయలేదు . కార్మిక సంఘాల నేతలను చర్చలకు పిలించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సుముఖంగా లేకపోగా , ఆర్టీసీ రూట్లను ప్రయివేటీకరించాలని నిర్ణయించింది . అయితే ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ  సమ్మెలో భాగంగా రాస్తారోకోలు , ధర్నాలు , బసు డిపోల ముందు ఆందోళనలు చేపట్టారు . 


కార్మిక సంఘాల జేఏసీ నేతలు ఆమరణ నిరాహార దీక్షకు దిగగా , పోలీసులు రెండవ రోజే భగ్నం చేశారు . ఆర్టీసీ కార్మికులు సమ్మె ను పరిష్కరించే దిశగా హైకోర్టు , ముగ్గురు మాజీ న్యాయమూర్తులు కమిటీ ఏర్పాటు చేస్తామని పేర్కొంది . రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయాన్ని కోరగా , కమిటీ ఏర్పాటును ప్రభుత్వం వ్యతిరేకించింది. ఆర్టీసీ సమ్మె కేసు లేబర్ కోర్టు లో ఉన్నందున మాజీ న్యాయమూర్తుల కమిటీ ఏర్పాటు అవసరం లేదని చెప్పింది . సమ్మె చట్ట విరుద్ధమన్న ప్రభుత్వం , తాజాగా  ఫైనల్ అఫిడవిట్ దాఖలు చేసింది . ఫైనల్ అఫిడవిట్ లో మరోసారి సమ్మె చట్ట వ్యతిరేకమని పేర్కొంటూనే , కార్మిక  చట్టాలను ప్రస్తావించింది .


సమ్మె ద్వారా ప్రభుత్వాన్ని అస్థిరపర్చాలని కార్మికులు ప్రయత్నించారని , ఇక ఇప్పుడు కార్మికులు విధుల్లో చేరుతామన్న ఆలోచించాల్సిన పరిస్థితి నెలకొందని ఆర్టీసీ ఇంచార్జ్ ఎండీ సునీల్ శర్మ ఫైనల్ అఫిడవిట్ లో పేర్కొన్నారు . ఆర్టీసీ సమ్మె పై నేడు కోర్టు లో ఇరు వర్గాల వాదనలు విన్పించనున్న నేపధ్యం లో న్యాయస్థానం కీలక తీర్పు ఇవ్వనుంది .   

మరింత సమాచారం తెలుసుకోండి: