దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ జైలు నుంచి బయటకు రావ‌డంతో...నియోజ‌క‌వ‌ర్గంలో ప‌రిణామాలు మారుతున్నాయి. బెయిల్‌పై విడుదలైన చింతమనేని మీడియా సమావేశంలో మాట్లాడుతూ...తనపై 18 కేసులు పెట్టారని.. వేటాడి వేధించారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్సీ, ఎస్టీ యాక్టును దుర్వినియోగం చేస్తున్నారని, త‌న‌పై అభియోగాల్లో..ఒక్క కేసులో తప్పు చేసినట్టు తేలినా.. ఈ ప్రపంచం నుంచే నిష్క్రమించేందుకు సిద్ధమన్నారు. స్పీక‌ర్ కోడెలపై అసెంబ్లీ ఫర్నీచర్ దొంగిలించారంటూ కేసులు పెట్టి వేధించడంతో ఆయన ఆత్మహత్యకు పాల్పడ్డారని ఆరోపించిన చింత‌మనేని..తనకు న్యాయ దేవతపై నమ్మకం ఉందని.. లేకుంటే కోడెల తరహాలోనే అదే జైలులో చనిపోయి ఉండేవాడినన్నారు. ఇలా చింత‌మ‌నేని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన మ‌రుస‌టి రోజే...ఆయ‌న్ను ప‌రామ‌ర్శించేందుకు..తెలుగుదేశం పార్టీ అధ్య‌క్షుడు నారా చంద్ర‌బాబు నాయుడు సిద్ధ‌మ‌య్యారు.


పశ్చిమ గోదావరి జిల్లాలో సోమ‌వారం నుంచి మూడు రోజులపాటు టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పర్యటించ‌నున్నారు. నియోజకవర్గాల సమీక్షలో భాగంగా నేతలతో చంద్రబాబు నాయుడు సమావేశం కానున్నారు. జిల్లా పార్టీ సమన్వయ కమిటీ సమావేశానికి హాజరుకానున్న చంద్రబాబు ఈ సంద‌ర్భంగా జిల్లాలో పార్టీకి పూర్వ వైభవం, శ్రేణుల మధ్య సమన్వయంపై చర్చించ‌నున్నారు. సోమ‌వారం గోపాలపురం, పోలవరం, ఏలూరు నియోజకవర్గాల నేతలతో చంద్రబాబు సమీక్షించనున్నారు. రాత్రికి తణుకులో  చంద్రబాబు బస చేయనున్నారు.


కాగా, ఈ టూర్‌లో చింతమనేని ప్రభాకర్‌ని  చంద్రబాబు పరామర్శించనున్నారు. చింత‌మ‌నేని ఇంటికి వెళ్లి ఆయ‌న్ను ప‌రామ‌ర్శిస్తార‌ని తెలుస్తోంది. ఇప్ప‌టికే తప్పుడు కేసులు పెట్టి జైల్లో పెట్టారని చింతమనేని వేధించార‌ని ఆరోపించిన చంద్ర‌బాబు ఈ సంద‌ర్భంగా దూకుడుగానే స్పందిస్తార‌ని అంటున్నారు. ‘నాపై పెట్టిన కేసులకు ఆర్నెల్లు శిక్ష పడుతుందేమో.. మరి జగన్‌పై ఉన్న కేసుల్లో శిక్ష పడితే ఆయనకు బాధ ఉండదా? జగన్‌ను జైల్లో పెట్టినప్పుడు ఆయన తల్లి, చెల్లి, కార్యకర్తలు ఎంత బాధపడి ఉంటారు. మీలాంటి మనసులు కావా ఇతర పార్టీల నేతలవి? మీలాంటి హృదయాలు కావా ఇతరులవి?` అని చింత‌మ‌నేని ఇప్ప‌టికే విరుచుకుప‌డిన సంగ‌తి తెలిసిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: