పాలిటిక్స్ లో ఉన్న నాయకులు హిట్ లిస్ట్ లో ఉన్నారు, త్రెట్ ఉంది.. అనే మాటలు వింటూంటాం. అందుకే రాజకీయ నాయకులకు భద్రత కూడా ఎక్కువగా ఉంటుంది. అయినా ఒక్కోసారి పలుమార్లు అనుకోని ఘటనల్లో కొందరు నాయకులపై దాడులు జరుగుతూంటాయి. కర్ణాటకలో ఓ ఎమ్మెల్యేపై  కత్తితో జరిగిన దాడి ప్రస్తుతం తీవ్ర కలకలం రేపుతోంది.  దాడికి గురైన ఎమ్మెల్యే గతంలో పలు వివాదాల్లో చిక్కుకున్నారు.




కర్ణాటక రాష్ట్ర మాజీ మంత్రి, ప్రస్తుత కాంగ్రెస్‌ ఎమ్మెల్యే తన్వీర్‌ సైత్‌పై గుర్తు తెలియని వ్యక్తి కత్తితో దాడి చేసాడు. తీవ్ర కలకలం రేపిన ఈ ఘటన ఆదివారం అర్థరాత్రి మైసూరు నగరం ప్రాంతంలో జరిగింది. ఈ దాడి జరిగిన సమయంలో ఎమ్మెల్యే పక్కనే ఉన్న సిబ్బంది అలర్ట్‌గా ఉండటంతో ప్రమాదం నుంచి తన్వీర్ సైత్ తప్పించుకున్నాడు. అయితే ఈ ఘటనలో ఎమ్మెల్యే తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే ఎమ్మెల్యేను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వైద్య చికిత్స కొనసాగుతోంది. ఎమ్మెల్యేపై దాడికి ప్రయత్నించిన వ్యక్తిని ఫర్హన్‌ పాషాగా గుర్తించారు. పోలీసులు ఫర్హన్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇది వ్యక్తిగతంగా జరిపిన దాడా.. లేక వెనుక ఎవరైనా ఉన్నారా.. అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 




తన్వీర్‌ ప్రస్తుతం నరసింహారాజ్‌ నియోజవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. కాగా గతంలో కర్ణాటక అసెంబ్లీలో అశ్లీల చిత్రాలు చూస్తూ తన్వీర్‌ వివాదాల్లో చిక్కుకున్నాడు. అప్పట్లో ఆయనపై పెద్ద దుమారమే చెలరేగింది. ఈ ఘటన రాజకీయ వర్గాల్లో తీవ్ర సంచలనం రేపింది. దీంతో ఎమ్మెల్యేకు భద్రత కట్టుదిట్టం చేశారు. నిత్యం ఇటువంటి దాడులు ప్రముఖులపై జరుగుతూ భద్రతను ప్రశ్నార్ధకం చేస్తున్నాయి. నిరసనలు, దాడులు చేసేవారు ఒక్కోసారి వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ ఇటువంటి ఘటనలకు పాల్పడుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: