ఇసుక కొరత కారణంగా భవన నిర్మాణాలపై ఆధారపడ్డ వారిలో 50 మంది ఆత్మహత్యలు చేసుకున్నట్లు చంద్రబాబునాయుడు చేస్తున్న ఆరోపణలు అందరికీ తెలిసిందే. ఇదే కారణంతో 12 గంటల దీక్ష కూడా చేశారు. మొన్నటి వరకూ  ఇసుక కొరత కారణంగా నిర్మాణ రంగం కుదేలైంది కాబట్టి  భవన నిర్మాణ రంగంపై ఆధారపడ్డ వారిలో కొందరు ఆత్మహత్యలు చేసుకున్నారనే అనుకుందాం.

 

టిడిపి ఆరోపణలు నిజమే అయితే  ఇపుడు ఇసుక బాగానే దొరుకుతోంది కదా ? మరి ఇపుడు కూడా ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ? గడచిన పది రోజుల నుండి వర్షాలు, వరదల ప్రభావం బాగా తగ్గిపోయింది. దాంతో గుర్తించిన ఇసుక రీచ్ ల నుండి భారీగా ఇసుక తవ్వకాలు మొదలయ్యాయి. తవ్విన ఇసుకను స్టాక్ పాయింట్లకు తరలించి అక్కడి నుండి వినియోగదారులకు సరఫరా చేస్తున్నారు.

 

ఇసుక కొరత ఉన్న రోజుల్లో కూడా రోజుకు సుమారు 35 వేల టన్నుల ఇసుకను ప్రభుత్వం సరఫరా చేయగలిగింది. గురువారం నాడు 1.77 లక్షల టన్నుల ఇసుకను ప్రభుత్వం వినియోగదారులకు సరఫరా చేసినట్లు అధికార గణాంకాలు చెబుతున్నాయి. దీన్ని 2 లక్షల టన్నులకు పెంచాలని జగన్ ఆదేశించిన విషయం అందరికీ తెలిసిందే.

 

కావాల్సినంత ఇసుక దొరుకుతోంది కాబట్టి నిర్మాణ రంగం మళ్ళీ ఊపందుకోవాలి. నిర్మాణ రంగం ఊపందుకున్నదో లేదో తెలీదు కానీ ఆత్మహత్యలు మాత్రం తగ్గటం లేదు. అంటే చంద్రబాబు అండ్ కో ఇన్ని రోజులుగా చేస్తున్న ఆరోపణలు పూర్తి నిజం కాదని అర్ధమైపోతోంది. మరి నిజాలేమిటి ?

 

ఏమిటంటే కొరతున్నది వాస్తవమే కాని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నంతగా  లేదు. అలాగే కొందరు ఆత్మహత్యలు చేసుకున్నది కూడా వాస్తవమే. కానీ అన్నీ ఆత్మహత్యలూ ఇసుకకొరత వల్లే జరగలేదు. వ్యక్తిగత కారణాలతో చేసుకున్న ఆత్మహత్యలను కూడా చంద్రాబాబు అండ్ కో ఇసుక కొరత ఖాతాలో వేసేసి జగన్మోహన్ రెడ్డి గబ్బు పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా చంద్రబాబు వాస్తవాలు గ్రహిస్తే మంచిది.


మరింత సమాచారం తెలుసుకోండి: