హైదరాబాద్ జీడిమెట్ల పారిశ్రామికవాడలో పేలుడు ఘటన కలకలం రేపుతోంది. ఒక కెమికల్ కంపెనీలో రియాక్టర్ పేలడంతో పేలుడు సంభవించింది. ఈ పేలుడు ఘటనలో ఒకరు మృతి చెందగా నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడినవారిని ఆస్పత్రికి తరలించారు. కంపెనీ లోపల ఒక కార్మికుడు చిక్కుకున్నాడు. సిబ్బంది ఆ కార్మికుడిని రక్షించేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. జీడిమెట్లలోని ఒక కంపెనీలో కొంతసేపటి క్రితం ఈ పేలుడు సంభవించింది. 
 
రియాక్టర్ పేలడంతో కంపెనీ పైకప్పు తునాతునకలైంది. పేలుడు సంభవించడంతో జీడిమెట్ల పారిశ్రామికవాడ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. సంఘటనా స్థలానికి ఇప్పటికే ఫైర్ ఇంజన్ చేరుకుంది.  ఫైర్ సిబ్బంది లోపలికి వెళ్లేంత సాహసం చేయలేకపోతున్నారని సమాచారం. 
 
ఈ ఫ్యాక్టరీకి చుట్టుపక్కల తునాతునకలైన రేకులు పేలుడు ధాటికి ఎక్కడపడితే అక్కడ పడుతూ ఉండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. పేలుడు ధాటికి కంపెనీలోని చాలా భాగాలు కూడా దెబ్బతిన్నాయి. గాయాల పాలైన నలుగురి పరిస్థితి తీవ్ర విషమంగా ఉందని తెలుస్తోంది. లోపల చిక్కుకున్న కార్మికుడిని రక్షించేందుకు సిబ్బంది అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. 
 
దట్టమైన పొగలతో కూడిన మంటలు ఏర్పడటం వలన ఫైర్ ఇంజిన్ మంటలు ఆర్పటానికి ప్రయత్నిస్తున్నప్పటికీ కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నట్లు తెలుస్తోంది. ఈ పేలుడు ఘటనతో చుట్టుపక్కల ప్రాంతాలలో నివాసం ఉంటున్న ప్రజలు ఆందోళన చెందుతున్నారు. గాయాలైన వారికి ప్రస్తుతం ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స జరుగుతోందని తెలుస్తోంది. గతంలో కూడా జీడిమెట్ల పారిశ్రామికవాడలో రియాక్టర్ పేలటంతో భారీ అగ్ని ప్రమాదాలు జరిగాయి. రియాక్టర్లు పేలటంతో కోట్ల రూపాయల ఆస్తి బుగ్గిపాలవుతోంది. రియాక్టర్లు పేలిన తరువాత ఉవ్వెత్తున మంటలు ఎగిసిపడుతూ ఉండటంతో సహాయక చర్యలకు కూడా ఆటంకాలు ఎదురవుతున్నాయి. రెండు నెలల క్రితం జీడిమెట్లలో రియాక్టర్ పేలటంతో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. 




మరింత సమాచారం తెలుసుకోండి: