మాజీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. ట్విట్టర్ వేదికగా మరోసారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపైమంది పడ్డారు . ప్రకాశం జిల్లాలో టీడీపీ కార్యకర్తల పొలాలకు వెళ్లే దారిని వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు ధ్వంసం చేశారని మండిపడ్డారు. అలాగే కర్నూలు జిల్లాలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు ప్రజలపై దాడులు చేశారని ఆరోపించారు.

వాళ్లు వైఎస్సార్‌సీపీ‘వైకాపా రాక్షస పాలన పరాకాష్టకు చేరుకుంది. ఇప్పటివరకూ టిడిపి కార్యకర్తలను హత్య చెయ్యడం, ఇళ్ళ నుండి బయటకి రాకుండా గోడలు కట్టడం, వేధించి ఆత్మహత్యలు చేసుకునేలా చెయ్యడం చేసారు. ఇప్పుడు వైకాపా రౌడీలు మరో అడుగు ముందుకేసి ఏకంగా ప్రజలపై పడ్డారు. కర్నూలు జిల్లా కాల్వబుగ్గ గ్రామస్తులు త్రాగునీరు ఇవ్వండి అని వేడుకున్నారు.


ఫలితం లేకపోయే సరికి గ్రామస్తులే బోర్ రిపేర్ చేసుకునేందుకు ప్రయత్నించారు. ఈ మాత్రం దానికే కత్తులు, కొడవళ్ళతో వైకాపా నాయకులు దాడులకు దిగి, ప్రజల తలలు పగలగొట్టారు. అక్కా, చెల్లీ నన్ను గెలిపిస్తే మీ ఇంటి ముందు నవరత్నాలు పోస్తా అన్నారు జగన్ గారు. నవరత్నాలు దేవుడెరుగు త్రాగడానికి గుక్కెడు నీరు ఇస్తే చాలు అనుకుంటున్నారు మా అక్కాచెల్లెళ్ళు’అంటూ ఎద్దేవా చేశారు.


ప్రకాశం జిల్లా కోనంకి గ్రామంలో టిడిపికి ఓటు వేశారన్న అక్కసుతో ఎస్సీ రైతులను వారి పొలాల్లోకి వెళ్లకుండా వైకాపా నాయకులు రోడ్డు తవ్వేసారు. ఇదివరకు పల్నాడు ప్రాంతంలో 127 ఎస్సీ కుటుంబాలను ఊర్ల నుండి వెలివేశారు.సన్న, చిన్నకారు రైతులను తమ పొలానికి వెళ్లకుండా చెయ్యడమే రైతులకు జగన్ గారు తెచ్చిన స్వర్ణ యుగమా? గ్రామాల్లో వైకాపా చేస్తున్న అరాచకాల ఫలితంగా ఇప్పటికే కేంద్ర మానవ హక్కుల సంఘం రాష్ట్రంలో పర్యటించింది.


కానీ పరిస్థితులు చూస్తుంటే దేశవ్యాప్తంగా ఉన్న మానవ హక్కుల సంఘం బృందాలన్నీ రాష్ట్రంలో పర్యటించాల్సిన రోజులు దగ్గర పడ్డాయనిపిస్తోంది. రైతులను వేధించిన వారికి పుట్టగతులు ఉండవన్న విషయం జగన్ గారు గుర్తు పెట్టుకోవాలి’అన్నారు నారా లోకేష్



మరింత సమాచారం తెలుసుకోండి: