భారత సమాఖ్య విధానానికి రాజ్యసభ ఆత్మవంటిదన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. రాజ్యసభ 250వ సమావేశాల సందర్భంగా సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. ఎన్నో చారిత్రక బిల్లులకు ఆమోదం తెలిపిన రాజ్యసభ.. చాలాసార్లు చరిత్ర సృష్టించిందని మోడీ గుర్తుచేశారు.


రాజ్యసభ 250వ సమావేశాల సందర్భంగా... భారత్ రాజకీయాల్లో పెద్దల సభ పాత్రపై చర్చ జరిగింది. రాజ్యసభ ఎన్నో చారిత్రక ఘటనలకు సాక్ష్యంగా నిలిచిందన్నారు ప్రధాని మోడీ.  జాతి వృద్ధికి రాజ్యసభ చిహ్నమని స్పష్టం చేశారు. దేశ గతిని మార్చే పలు బిల్లులను రాజ్యసభ ఆమోదించడంతో అవి చట్టరూపం దాల్చి సుపరిపాలనకు అద్దం పట్టాయని మోడీ గుర్తుచేశారు. మహిళా సాధికారతలో కీలక ముందడుగైన ట్రిపుల్‌ తలాక్‌ బిల్లును రాజ్యసభ ఆమోదించిందని కొనియాడారు. దేశానికి మంచి జరిగే సందర్భాల్లో రాజ్యసభ తనదైన పాత్రను పోషించేందుకు వెనుకాడలేదనీ, పెద్దల సభలో ఆమోదం పొందిన తర్వాత జీఎస్టీ అమలుకు నోచుకుందని పేర్కొన్నారు.


రాజ్యసభను ఏ ఒక్కరూ సెకండరీ సభగా పరిగణించరాదనీ, ఇది దేశ అభివృద్ధికి సపోర్టింగ్‌ హౌస్‌గా పనిచేస్తుందన్న మాజీ ప్రధాని వాజ్ పేయి మాటల్ని గుర్తుచేసుకున్నారు మోడీ. సభలో బీజేడీ, ఎన్సీపీ సభ్యుల తీరును ప్రధాని ప్రశంసించారు. ఈ పార్టీల సభ్యులు ఎన్నడూ వెల్‌లోకి వెళ్లరనీ, ఈ పార్టీల నుంచి బీజేపీతో సహా అన్ని పార్టీలు క్రమశిక్షణ నేర్చుకోవాలని సూచించారు మోడీ. లోక్ సభ లో మెజార్టీ ఉన్న ప్రభుత్వం కట్టుతప్పకుండా రాజ్యసభ చూసుకుంటోందన్నారు మాజీ ప్రధాని మన్మోహన్. మెజార్టీ వాదం విశృంఖలత్వానికి దారి తీయకుండా ఎప్పటికప్పుడు రాజ్యసభ అదుపులో పెడుతూ వచ్చిందని ఆయన గుర్తుచేశారు. రాజ్యసభ 250వ సమావేశం జరుగుతున్న తరుణంలో.. ఈ భావోద్వేగ సందర్భంలో పాలుపంచుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉందన్నారు మన్మోహన్. అంతకుముందు రాజ్యసభ ప్రాముఖ్యతను సభ్యులకు వివరించారు ఛైర్మన్ వెంకయ్యనాయుడు. గత 67 ఏళ్లలో జరిగిన మంచిని గుర్తుచేసుకోవడంతో పాటు, ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన సందర్భం ఇదే అని చెప్పారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: