విజయవాడ కేంద్రంగా పనిచేస్తున్న పవర్ ప్లాంట్స్, రియల్ ఎస్టేట్, ఆరోగ్య రంగానికి చెందిన లింగమనేని ఎస్టేట్స్ అండ్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ లా ట్రిబ్యునల్ లో దివాళా పిటిషన్ దాఖలు చేసింది. ఈ నెల 14వ తేదీన కంపెనీ ఈ పిటిషన్ ను దాఖలు చేసింది. తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించలేమని కంపెనీ చేతులెత్తేసింది. ఈ కంపెనీకు రుణాలు ఇచ్చిన సంస్థలు ఈ నెల 29వ తేదీలోగా తగిన ఆధారాలు మరియు డాక్యుమెంట్లు తీసుకొని బోర్డు ముందు హాజరు కావాలని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. 
 
2020 మే 12లోపు దీనికి సంబంధించిన ప్రక్రియను పూర్తి చేయాలని లా ట్రిబ్యునల్ భావిస్తోంది. అక్రమంగా కొన్ని కంపెనీలను స్థాపించి రుణాలను లింగమనేని ఎస్టేట్స్ అండ్ ప్రాజెక్ట్స్ కంపెనీ సేకరించినట్లు సమాచారం. ఈ కంపెనీ ఎయిర్ లైన్స్ ఇండస్ట్రీలోకి కూడా ప్రవేశించింది. 2013లో లింగమనేని కంపెనీ ఎయిర్ లైన్స్ ను ప్రారంభించగా 2017లో విమానాలను కూడా కొనుగోలు చేశారని సమాచారం. 
 
50 విమానాలకు సంబంధించిన డబ్బులు చెల్లించకపోవటంతో ఆ కంపెనీని కూడా మూసివేశారని సమాచారం. ఇప్పటికే లింగమనేని గెస్ట్ హౌస్ కు సంబంధించిన ఒక వివాదం నడుస్తోంది. ఇలాంటి సమయంలో ఈ కంపెనీ ఒక పిటిషన్ ను దాఖలు చేయడం చర్చనీయాంశమైంది. రుణదాతలు ఆధారాలతో సహా లా ట్రిబ్యునల్ ముందుకు వచ్చినా కంపెనీ తిరిగి చెల్లించడం కష్టమేనని తెలుస్తోంది. 
 
1996వ సంవత్సరం మార్చి నెలలో లింగమనేని ఎస్టేట్స్ ప్రారంభమైంది. హైదరాబాద్ లోని బంజారాహిల్స్ లో కార్పొరేట్ ఆఫీస్ ఉండగా రిజిస్టర్ ఆఫీస్ విజయవాడలో ఉంది. కోస్తా ప్రాంతంలో ఎక్కువగా నిర్మాణాలు చేపట్టిన లింగమనేని అమరావతి, విజయవాడలో ఎక్కువ ప్రాజెక్టులు చేపట్టారు. భారీ మొత్తంలో అడ్వాన్సుల పేరుతో ఈ కంపెనీ నిర్వాహకులు పెద్ద ఎత్తున కస్టమర్ల నుండి వసూలు చేసినట్లు తెలుస్తోంది. 
 
 



మరింత సమాచారం తెలుసుకోండి: