తెలంగాణ‌లో జ‌రుగుతున్న ఆర్టీసీ స‌మ్మెలో కీల‌క ప‌రిణామం చోటు చేసుకుంది. ఓ వైపు ఆర్టీసీ సమ్మెపై హైకోర్టులో విచారణ ముగిసింది. ఈ వ్యవహారంపై రెండు వారాల్లో ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. సమ్మె లీగలా? ఇల్లీగలా? అని తేల్చాలని కార్మిక శాఖ కమిషనర్‌ను న్యాయస్థానం ఆదేశించింది. రెండు వారాల్లో దీన్నిపై స్పష్టమైన నివేదికను రూపొందించి, ప్రభుత్వానికి అందజేయాలని హైకోర్టు  సూచించింది. కాగా, ఈ తీర్పు వ‌చ్చిన కొద్ది స‌మ‌యం త‌ర్వాత ఆర్టీసీ జేఏసీ క‌న్వీన‌ర్‌ అశ్వత్థామరెడ్డి, కో క‌న్వీన‌ర్‌ రాజిరెడ్డి దీక్ష విరమించారు. సమ్మెపై రేపు సాయంత్రం నిర్ణయాన్ని ప్రకటించనున్నట్లు ఆర్టీసీ జేఏసి నేత‌లు తెలిపారు.
 
ఎమ్మార్పీఎస్ నేత మంద‌కృష్ణ మాదిగ అశ్వ‌త్థామ‌రెడ్డికి నిమ్మ‌ర‌సం ఇచ్చి ఆస్ప‌త్రిలో ఆయ‌న చేత దీక్ష విర‌మింప చేశారు. అనంత‌రం అశ్వత్థామరెడ్డి మీడియాతో మాట్లాడుతూ, దీక్ష మాత్రమే విరమించామని ఆర్టీసీ సమ్మె కొనసాగుతుందని ప్ర‌క‌టించారు. సమ్మెపై మంగ‌ళ‌వారం సాయంత్రం తుది నిర్ణయం తీసుకుంటామ‌న్నారు. 19వ తేదీన నిర్వ‌హించ‌త‌ల‌పెట్టిన సడక్ బంద్ వాయిదా వేసుకున్న‌ట్లు వెల్ల‌డించారు. దీక్ష విరమించాలని నిర్ణయం తీసుకున్న‌ప్ప‌టికీ...ఆర్టీసీ కార్మికుల ఆందోళన కొనసాగుతుందని టీజేఎస్ నేత కోదండరాం తెలిపారు.


మ‌రోవైపు, ఆర్టీసీ స‌మ్మెపై కోర్టులో ఆస‌క్తిక‌ర వాద‌న‌లు జ‌రిగాయి.  ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల క్రెడిట్ కోపరేటివ్ సొసైటీ సేవింగ్స్ 1900కోట్లు వాడుకుందని, పీఎఫ్ డబ్బులు 900 కోట్లు వినియోగించుకుందని కార్మికుల తరఫు న్యాయవాది  ప్రకాశ్ రెడ్డి  తెలిపారు. ప్రజలెన్నుకున్న ప్రభుత్వమే ప్రజలకి ఇబ్బంది జరుగుతుంటే పట్టించుకోకుండా ఉంటే ఎలా అని వ్యాఖ్యానించారు. 45 రోజులుగా సమ్మె సాగుతోందని, తాము ఇప్పటికే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్న ప్రధాన డిమాండ్‌ను పక్కనపెట్టామని చెప్పారు. దీన్ని పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వం చర్చలు జరిపేలా ఆదేశించాలని కోర్టును కోరారు. అయితే చర్చలకు తాము ఆదేశాలివ్వలేమని ధర్మాసనం చెప్పింది. ఎటువంటి ఒత్తిడి లేకుండా చర్చలు జరగాలని తెలిపింది. 



మరింత సమాచారం తెలుసుకోండి: