జేఎన్‌యూ ఆందోళనలతో ఢిల్లీ అట్టుడుకుతోంది. విద్యార్థుల నిరసనలతో ఆ ప్రాంతమంతా ఉద్రిక్తంగా మారింది. ఫీజుల పెంపుతో యూనివర్సిటీలో మొదలైన గొడవ పార్లమెంటును తాకింది. విద్యార్థులు పార్లమెంటు ముట్టడికి ప్రయత్నించడంతో భారీగా పోలీసులను మొహరించారు. విద్యార్థులకు పోలీసులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. 


దేశ రాజధాని ఢిల్లీలోని జవహర్‌ లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయం విద్యార్థుల నిరసనలు తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీశాయి. వసతి గృహం ఫీజుల పెంపు సహా పలు డిమాండ్ లు పరిష్కరించాలంటూ వేలాది మంది విద్యార్థులు పార్లమెంట్‌ ముట్టడికి బయల్దేరారు. వారిని  అడ్డుకొనేందుకు పోలీసులు భారీగా మోహరించారు. ఉద్రిక్త పరిస్తితులు తలెత్తకుండా క్యాంపస్‌ బయట దాదాపు 1200 మంది భద్రతా సిబ్బంది మోహరించారు. క్యాంపస్‌ వద్ద, పార్లమెంటు బయట 144 సెక్షన్‌ విధించారు. అయినా వేలాది మంది జేఎన్‌యూ విద్యార్థులు ర్యాలీగా తరలొచ్చారు.  


యూనివర్సిటీ నుంచి బయల్దేరి పార్లమెంట్‌ భవనం వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించిన విద్యార్థులను సఫ్దర్‌గంజ్‌ సమాధి వద్ద పోలీసులు అడ్డుకున్నారు. అలాగే ఢిల్లీలోని పలు మెట్రో స్టేషన్లలో రాకపోకలను నిలిపివేశారు. పోలీసుల ఆదేశాల మేరకు ఉద్యోగ్‌ భవన్‌, పటేల్‌ చౌక్‌, సెంట్రల్‌ సెక్రటేరియట్‌ రైల్వే స్టేషన్లను ఢిల్లీ మెట్రో రైలు అధికారులు మూసివేశారు. విద్యార్థుల ర్యాలీతో పలు ప్రధాన ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్‌ స్తంభించింది.


జేఎన్‌యూలో వసతిగృహ ఫీజులను పెంచుతూ వర్శిటీ కార్యనిర్వాహక శాఖ వారం రోజుల క్రితం నిర్ణయం తీసుకుంది. అప్పటి నుంచి విద్యార్థులు ఆందోళనలు చేస్తున్నారు. అయితే జేఎన్‌యూ విద్యార్థుల డిమాండ్లపై చర్చలకు ప్రభుత్వం ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసిందని మానవ వనరుల శాఖ తెలిపింది. ఫీజుల పెంపుపై ప్యానెల్‌ నియమించిన విషయాన్ని అధికారులు తమకు తెలియజేయడంలేదంటున్నాయి విద్యార్థి సంఘాలు. విద్యార్థుల ఆందోళనకు  ప్రతిపక్షాలు మద్దతు పలికాయి. ఎమర్జెన్సీ కాలంలో కూడా ఇంత భారీగా పోలీసులను మోహరించలేదని మండిపడ్డాయి. 


మరింత సమాచారం తెలుసుకోండి: