ఇసుక అక్రమ రవాణాను అరికట్టేందుకు పటిష్ట చర్యలు చేపట్టింది ఏపీ ప్రభుత్వం. అవినీతిని ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చేందుకు టోల్‌ఫ్రీ నెంబర్‌ను ప్రారంభించింది. ఇసుకను అక్రమంగా విక్రయించేవారిని కఠినంగా శిక్షిస్తామంటూ వార్నింగ్‌ ఇచ్చింది ఏపీ సర్కార్‌. 


ఇసుక రవాణాలో అక్రమాల కట్టడికి ప్రభుత్వం సిద్దమవుతోంది. ఇసుకను అక్రమంగా తవ్వడం, రవాణా చేయడం, నిల్వచేయడం, అధిక ధరలకు విక్రయించడాన్ని తీవ్రంగా పరిగణిస్తామని స్పష్టం చేసింది ప్రభుత్వం. ఈ విషయంలో ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను స్వీకరించడానికి 14500 టోల్‌ఫ్రీ నంబర్‌ను ప్రారంభించింది. క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌ టోల్‌ ఫ్రీ నంబర్‌ను ప్రారంభించారు. ఈ నంబర్‌కు కాల్‌చేసి కాల్‌ సెంటర్‌ ఉద్యోగులతో స్వయంగా సీఎం మాట్లాడారు. ఫిర్యాదులు స్వీకరిస్తున్న తీరును, వాటిని ఎవరికి నివేదిస్తున్నారన్న అంశాలను కాల్‌ సెంటర్ ఉద్యోగి నుంచి అడిగి తెలుసుకున్నారు. ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించే సమయంలో తీసుకోవాల్సిన సమాచారంపై కొన్ని సూచనలు కూడా ఇచ్చారు ఏపీ సీఎం.


వరదలు తగ్గుముఖం పట్టడంతో ఇసుకను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇసుక కొరతను అధిగమించేందుకు ప్రారంభించిన వారోత్సవాలు విజయవంతం అవుతున్నాయని ప్రకటించింది. రోజువారీ ఉత్పత్తి లక్ష టన్నుల నుంచి 2 లక్షల టన్నులకు పెంచాలన్న లక్ష్యాన్ని 48 గంటల్లోనే అధికారులు అధిగమించారని తెలిపింది. వరదలు తగ్గుముఖం పట్టడం, ఉత్పత్తికి అనుగుణంగా వాహనాలను తగినన్ని అందుబాటులోకి ఉంచడంతో ఇది విజయవంతమైందని చెప్పింది. దీంతో డిమాండ్‌ సగానికి తగ్గిపోయిందని ప్రభుత్వం స్పష్టం చేసింది. రానున్న రోజుల్లో  రోజువారీ డిమాండ్‌ 40వేల టన్నుల వరకూ ఉంటుందని అంచనా వేస్తోంది ఏపీ సర్కారు. 


ఇసుక అక్రమాలపై కఠినంగా వ్యవహారించాలని టాస్క్‌ఫోర్స్‌ చీఫ్‌ ను సీఎం ఆదేశించారు. కాల్‌సెంటర్‌ ద్వారా వచ్చే సమాచారాన్ని ఇసుక అక్రమాల నిరోధానికి వాడుకోవాలని, తప్పులు చేసిన వారిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు సీఎం జగన్‌.  ఇసుకను అధిక ధరలకు విక్రయించిన నిందితులకు రెండేళ్ల జైలు శిక్షతో పాటు రెండు లక్షల రూపాయల జరిమానా విధించేలా ఇదివరకే మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. తాజాగా తీసుకున్న నిర్ణయంతో ప్రభుత్వం ఇసుక సమస్యను ఏ మేరకు పరిష్కరిస్తుందో చూడాలి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: