ట్విస్టుల మీద ట్విస్టుల‌తో సాగుతున్న మ‌హారాష్ట్ర రాజకీయంలో...ప్ర‌భుత్వ ఏర్పాటు ప్ర‌హ‌స‌నంలో...ఎన్సీపీ అధినేత శరద్ పవార్ మ‌రింత క్రేజ్‌ను సృష్టించారు. మహారాష్ట్రలో ప్రస్తుత రాజకీయ పరిస్థితిని చ‌ర్చించేందుకు, ప్ర‌భుత్వ ఏర్పాటుకు శివ‌సేన తీసుకువ‌స్తున్న ప్ర‌తిపాద‌న‌ల‌ను వివ‌రించేందుకు...కాంగ్రెస్ తాత్క‌లిక అధ్య‌క్షురాలు  సోనియా గాంధీతో ఆయ‌న స‌మావేశం కానున్న‌ట్లు వార్త‌లు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. అయితే,  ఇవాళ సాయంత్రం సోనియాతో భేటీ అయింది కానీ...ప్ర‌భుత్వ ఏర్పాటు గురించి చ‌ర్చే జ‌ర‌గ‌లేద‌ట‌. కాంగ్రెస్ నాయ‌కురాలితో భేటీ త‌ర్వాత స్వ‌యంగా ఈ విష‌యం మీడియాతో వెల్ల‌డించి ప‌వార్ షాకిచ్చారు. 


సోనియా గాంధీతో స‌మావేశం అయిన ఎన్సీపీ నేత శ‌ర‌ద్ ప‌వార్ అనంత‌రం ఢిల్లీలోని త‌న నివాసంలో ఆయ‌న మీడియాతో మాట్లాడారు. మ‌హారాష్ట్ర‌లో నెల‌కొన్న రాజ‌కీయ అనిశ్చితిపై కాంగ్రెస్ పార్టీ నేత సోనియా గాంధీతో సుదీర్ఘంగా చ‌ర్చించిన‌ట్లు తెలిపారు. త‌మ స‌మావేశంలో ప్ర‌భుత్వ ఏర్పాటు గురించి చ‌ర్చించ‌లేద‌ని ప‌వార్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌భుత్వ ఏర్పాటు విష‌యంలో..రెండు పార్టీల‌కు చెందిన మ‌రికొంత మంది నేత‌ల‌తో మాట్లాడిన త‌ర్వాత తుది నిర్ణ‌యం ఉంటుంద‌న్నారు. కేవ‌లం కాంగ్రెస్‌, ఎన్సీపీ మ‌ధ్యే ఈ మీటింగ్ జ‌రిగింద‌న్నారు. త‌మకు 170 మంది ఎమ్మెల్యేల స‌పోర్ట్ ఉంద‌ని శివ‌సేన‌ చేసిన కామెంట్‌పై స్పందించేందుకు శ‌ర‌ద్ ప‌వార్ నిరాక‌రించారు. అయితే, అంద‌రు ఎమ్మెల్యేల‌ను ఆ పార్టీ ఎలా కూడ‌గ‌డుతుంద‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. త‌మ కూట‌మిలో శివ‌సేన ఉండాలా లేదా అన్న అంశంపై ఇంకా సందిగ్ధ‌త ఉంద‌ని అన్నారు. భవిష్యత్ కార్యాచరణపై చర్చించేందుకు ఎన్సీపీ, కాంగ్రెస్ నాయకులు ఒకట్రెండు రోజుల్లో దిల్లీలో సమావేశం కానున్నట్లు ఆయ‌న వెల్ల‌డించారు. 

మహారాష్ట్రలో  ప్రభుత్వ ఏర్పాటుకు అన్ని పార్టీలూ ఫెయిల్ కావడంతో ఇప్పటికే రాష్ట్రపతి పాలన నడుస్తోంది. ఆ తర్వాత కూడా ఎన్సీపీ – కాంగ్రెస్‌లతో కలిసి శివసేన సర్కారు ఏర్పాటు చేయబోతోందంటూ నిన్నటి దాకా ప్రకటనలు చేశాయి. ఈ నేప‌థ్యంలో స‌హ‌జంగానే ప‌వార్ కామెంట్లు ప్ర‌కంప‌న‌లు సృష్టిస్తున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: