మరాఠా సింహాసనం అధిష్ఠించాలని శివసేన కంకణం కట్టుకుంది. బీజేపీతో దశాబ్దాల ఫ్రెండ్ షిప్ కు గుడ్ బై చెప్పి మరీ.. సంకీర్ణ సర్కారు దిశగా అడుగులు వేస్తోంది. చరిత్రలో ఎప్పుడూ చేయని రిస్క్ చేస్తున్న శివసేన నేతలు.. పాతికేళ్లు తామే పాలిస్తామని చెబుతున్నారు. ఇంతకూ శివసేన గేమ్ ప్లాన్ ఏంటి..?


మహారాష్ట్రలో ప్రజలిచ్చిన తీర్పు.. చిరకాల మిత్రుల మధ్య చిచ్చు పెట్టింది. సీఎం పదవి దగ్గర మొదలైన పీటముడి.. ఏకంగా బంధం తెగిపోయే వరకు వచ్చింది. గతంలో మహారాష్ట్రలో పెద్దన్నగా చక్రం తిప్పిన శివసేన.. 2014 తర్వాత బీజేపీలో వచ్చిన మార్పుపై ఎప్పట్నుంచో అసంతృప్తిగానే ఉంది. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా శివసేన, బీజేపీ వేర్వేరుగానే పోటీ చేశాయి. అయితే ఫలితాలు వచ్చాక సంకీర్ణ సర్కారే ఏర్పడింది. 


మళ్లీ 2019 పార్లమెంట్ ఎన్నికలు వచ్చేసరికి.. శివసేన ఒంటరిపోరు ఆలోచన చేసింది. అయితే బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ముంబై వచ్చి.. మాతోశ్రీతో ఉద్ధవ్ థాక్రేతో చర్చలు జరిపారు. చర్చలు ఫలించడంతో.. పార్లమెంట్ ఎన్నికలతో పాటు మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా రెండు పార్టీలు కలిసే పోటీచేశాయి. కానీ ఫలితాలు వచ్చాక సీన్ మారిపోయింది. సీఎం పదవి పంపకం కోసం శివసేన పట్టుబట్టడంతో.. బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు అడ్డంకి ఎదురైంది. శివసేనను మెత్తబరచడానికి కాషాయ పార్టీ చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. పైగా అమిత్ షా తో జరిగిన చర్చల్లో కుదిరిన ఒప్పందం ప్రకారమే అడుగుతున్నామని శివసేన గళం పెంచింది. 


కానీ సీఎం పదవి పంపకంపై ఎలాంటి డీల్ కుదర్లేదని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తేల్చేయడంతో.. శివసేన మరింత బుసలు కొట్టింది. ఫడ్నవీస్ పచ్చి అబద్ధాలు చెబుతున్నారని మండిపడింది. సీఎం పదవి పంపకం జరగకపోతే బీజేపీకి మద్దతిచ్చే ప్రసక్తే లేదని కుండబద్దలు కొట్టింది. దీంతో గవర్నర్ ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించినా.. తమకు సంఖ్యాబలం లేదని చెప్పింది బీజేపీ. అక్కడే శివసేన వేగంగా పావుల కదిపింది. 


సిద్ధాంతరీత్యా బీజేపీ మినహా మరో పార్టీతో శివసేన పొత్తు పెట్టుకోదన్న అనుమానాల్ని పటాపంచలు చేస్తూ.. ఎన్సీపీ, కాంగ్రెస్ తో టచ్ లోకి వెళ్లింది ఆ పార్టీ. మూడు పార్టీల మధ్య గత కొన్ని రోజులుగా చర్చలు జరుగుతున్నాయి. ఓ దశలో సంకీర్ణం ఏర్పడటం ఖాయం అనుకున్న తరుణంలో.. మహారాష్ట్ర గవర్నర్ ను అడ్డుపెట్టుకుని బీజేపీ నడిపిన గేమ్.. శివసేనకు ఇంకా కోపం తెప్పించింది. గవర్నర్ అప్రజాస్వామికంగా వ్యవహరించారని, కేంద్రంలో అధికారం శాశ్వతం కాదని బీజేపీ గుర్తుంచుకోవాలని శివసేన వార్నింగ్ ఇచ్చింది. 


సీఎం పదవి కోసం ఎప్పుడూ లేని విధంగా శివసేన పట్టుబట్టడానికి బలమైన కారణమే ఉంది. థాక్రే కుటుంబం నుంచి తొలిసారి ఓ వ్యక్తి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీచేసి.. భారీ మెజార్టీతో గెలిచాడు. అతడే ఉద్ధవ్ థాక్రే కొడుకు ఆదిత్య థాక్రే. ఆదిత్యను ఎట్టి పరిస్థితుల్లో సీఎం చేయాలని శివసేన కంకణం కట్టుకుంది. ఆదిత్య గెలిచిన దగ్గర్నుంచి భావి సీఎం అంటూ బ్యానర్లు కట్టి హడావిడి చేసింది. అదేమంటే తాను బాలాసాహెబ్ కు మాటిచ్చానంటున్నారు ఉద్ధవ్ థాక్రే. అయితే ఇప్పుడు ఆదిత్య సీఎం అయ్యే అవకాశం లేదని, మూడు పార్టీల ప్రభుత్వం ఏర్పడినా.. ఉద్ధవ్ ముఖ్యమంత్రి అవుతారని ఊహాగానాలు హల్ చల్ చేస్తున్నాయి. 



మరింత సమాచారం తెలుసుకోండి: