పీపుల్ స్టార్ ఆర్ నారాయణ మూర్తి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇంగ్లీష్ మీడియం విద్యావిధానంపై తీసుకున్న నిర్ణయానికి ప్రశంసలు కురిపించారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టాలని ఏపీ సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాన్ని తాను సమర్ధిస్తున్నానన్నారు. 


ఆర్ నారాయణ మూర్తి ఇంగ్లీష్ మీడియం విద్యావిధానంపై మాట్లాడారు. ‘జగన్ తీసుకున్న ఈ నిర్ణయం పేద, బడుగు, బలహీన వర్గాల వారికే కాకుండా అగ్రవర్ణం పేదలకు ఈ ఇంగ్లీషు మీడియం విద్యా విధానం లాభదాయకం అవుతుంది. 90 శాతం ఉన్న బడుగు, బలహీన, మైనారిటీ వర్గాల ప్రజలు ఇంగ్లీషు మీడియం చదువుకోలేక, ప్రైవేటు స్కూల్స్‌లో ఫీజులు కట్టలేక ఇబ్బందులు పడుతున్నారు. డబ్బున్న వాడు ఇంగ్లీషు మీడియం స్కూల్స్‌లో చదవగలుగుతున్నాడు. మరి డబ్బులేని పేద పిల్లలు ఏం కావాలి..? గన్‌మెన్‌లు, గుమస్తాలు కావాలా..? డాక్టర్‌లు, ఇంజనీర్లు కాకూడదా..? అంటూ ప్రశ్నించారు. చదువుకోవాలనుకున్న ప్రతి విద్యార్ధికి సమాన విద్యా అవకాశాలు దొరకాలి. అలా జరగాలంటే ఖచ్చితంగా నిర్బంధ ఇంగ్లీష్ విద్యా విధానం పెట్టాల్సిందే.


అలాంటి డేరింగ్ నిర్ణయాన్ని తీసుకున్న ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని నేను మనస్పూర్తిగా అభినందిస్తున్నా. అదే సందర్భంలో తెలుగును ముఖ్యమైన సబ్జెట్‌గా ఉంది కాబట్టి దాన్ని అలాగే ఉంచాలి. మన అమ్మ భాషను కాపాడుకుంటూనే ఇంగ్లీషు భాషపై పట్టు సాధించాలి.


ఇంగ్లీష్ వద్దు.. అంటున్న ఆ పెద్దలకు ఓ విజ్ఞ‌ప్తి చేస్తున్నా.. మీ బిడ్డలందరూ ఎక్కడ చదువుతున్నారు. తెలుగు మీడియం స్కూల్‌లో చదువుతున్నారా..? లేదే.. కాన్వెంట్‌లలో విదేశాల్లో ఇంగ్లీష్ మీడియం స్కూల్స్‌లో చదువుతున్నారు. ఇంగ్లీష్ వద్దనే మీరు ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోండి. తెలుగు భాష, నేల ఎవరి సొత్తు కాదు.. మన అమ్మను మనం కాపాడుకుంటాం. సేమ్ టైం ఇంగ్లీష్ భాషను నేర్చుకుంటూ ప్రపంచ స్థాయిలో ఎక్కడైనా పనిచేసేలా రాణించేలా మన బిడ్డల్ని తీర్చుదిద్దుకుందాం. దానికి అడ్డుపడొద్దు’ అంటూ ఇంగ్లీష్ మీడియం వద్దు అనే మేధావులకు చురకలు వేస్తూ ఆవేదన వ్యక్తం చేశారు ఆర్ నారాయణ మూర్తి.


మరింత సమాచారం తెలుసుకోండి: