వరుస కేసులతో రెండు నెలలుగా జైల్లోనే ఉన్న టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ను టీడీపీ అధినేత చంద్రబాబు పరామర్శించారు. ఆయన కుటుంబాన్ని కలుసుకుని బాగోగులు తెలుసుకున్నారు. అదే సమయంలో పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో పార్టీ పరిస్థితిని సమీక్షించిన చంద్రబాబు ఆ సమయంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రశాంతమైన పశ్చిమగోదావరి జిల్లాలో అరాచకం సృష్టిస్తున్నారని ధ్వజమెత్తారు.

 

చింతమనేని ప్రభాకర్.. సొంత ఖర్చులతో రైతులకు నీరందిస్తే తప్పుడు కేసులు పెట్టడం న్యాయమా? అని ప్రశ్నించారు. జగన్ డ్రామాలు ఎక్కడైనా నడుస్తాయేమో కానీ తన వద్ద సాగవని చంద్రబాబు హెచ్చరించారు. ప్రజావేదికను కూల్చి ఏం సాధించారని ప్రశ్నించారు. పోలీసు వ్యవస్థ ఎప్పుడూ నిష్పక్షపాతంగా పనిచేయాలని, పక్షపాతిగా వ్యవహరించొద్దని హెచ్చరించారు. ప్రభుత్వం తాటాకు చప్పుళ్లకు భయపడేవారెవరూ లేరని చంద్రబాబు అన్నారు.

 

అంతే కాదు.. చింతమనేని ప్రభాకర్ ఏం తప్పు చేశారని ఆయనపై కేసు పెట్టారని ప్రశ్నించారు. దొంగతనం చేశాడా? హత్య చేశాడా? బాబాయ్‌ని చంపించాడా? అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు చంద్రబాబు. కోడెల శివప్రసాదరావు పల్నాడు సింహ లాంటి నాయకుడని, లక్షా యాభైవేల రూపాయల ఫర్నీచర్ కోసం ఆత్మహత్య చేసుకుని చనిపోయేలా చేశారని చంద్రబాబు ఆరోపించారు. వైసీపీ అధికారంలోకి వచ్చి ఆరు నెలలు కావొస్తున్నా రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదని చంద్రబాబు మండిపడ్డారు.

 

పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన పార్టీ నేతలతో విస్తృతస్థాయి సమావేశం నిర్వహించిన చంద్రబాబు వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. గోదావరి ఇసుక ఉభయగోదావరి జిల్లాల్లో దొరకదు కానీ హైదరాబాద్, తమిళనాడులో దొరుకుతుందని ప్రభుత్వ విధానాలను చంద్రబాబు విమర్శించారు. గోదావరిలో మునిగిపోయిన బోటును వెలికితీసిన దర్మాడి సత్యంలో ఉన్న పట్టుదల సీఎం జగన్‌లో ఉంటే బాగుండేదని కామెంట్ చేశారు. మొత్తం మీద చింతమనేని ప్రభాకర్ ను పరామర్శించే క్రమంలో పశ్చిమగోదావరి జిల్లా నాయకుల్లో ఉత్సాహం నింపే ప్రయత్నం చేశారు చంద్రబాబు.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: