గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఇటీవలే టీడీపీకి గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. ఆయన ఇంకా వైసీపీలో చేరకపోయినా.. చేరతానని ప్రకటించడం వల్ల ఇక ఆయనకు టీడీపీతో రుణం తీరిపోయినట్టే. అంతే కాదు.. పోతూ పోతూ చంద్రబాబును, లోకేశ్ ను బండబూతులు తిట్టేసిపోతున్నాడు వంశీ. ఇలాంటి సమయంలో వంశీ గురించి ప్రస్తావించిన చంద్రబాబు ఆయన్ను పులి అంటూ పొగడటం ఆశ్చర్యం కలిగిస్తోంది.

 

టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ను పరామర్శించేందుకు పశ్చిమ గోదావరి జిల్లాకు వచ్చిన చంద్రబాబు... ఏలూరులో పార్టీ పరిస్థితిని సమీక్షించారు. చంద్రబాబు ఆ సమయంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. చింతమనేని ప్రభాకర్ ను పరామర్శించే క్రమంలో పశ్చిమ గోదావరి జిల్లా నాయకుల్లో ఉత్సాహం నింపే ప్రయత్నం చేశారు చంద్రబాబు. ఆ సమయంలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి.

 

ఆయన ఏమన్నారంటే.. “ వైసీపీ ప్రభుత్వం ఏర్పాటయ్యాక తొలి అసెంబ్లీ సమావేశాలకు వెళితే అధికార పార్టీ నేతలు తనపై రాబందుల్లా పడ్డారని ధ్వజమెత్తారు. సభలో టీడీపీ తరఫున ఇరవై మూడు మంది పులులు ఉంటే ఒక పులి బయటికి వెళ్లిపోయిందన్నారు. అయినప్పటికీ భయపడాల్సిన అవసరం లేదని పార్టీ శ్రేణులకు చంద్రబాబు ధైర్యం చెప్పారు. 23 పులులు అంటే 23 మంది ఎమ్మెల్యేలు.. అందులో వెళ్ళిపోయిన పులి వంశీ అన్నమాట. అంటే పార్టీ నుంచి వెళ్లిపోయినా వంశీని చంద్రబాబు పులితో పోల్చారన్న మాట.

 

అంతే కాుద.. టీడీపీ నాయకులపై అధికారులు తప్పుడు కేసులు పెడితే.. పార్టీ తరఫున అధికారులపైనే ప్రైవేట్ కేసులు వేస్తామని చంద్రబాబు హెచ్చరించారు. జగన్ జైలుకు వెళ్లి వచ్చాడు కాబట్టి.. రాష్ట్ర ప్రజలందరినీ జైలుకు పంపించాలని చూస్తున్నారని చంద్రబాబు అన్నారు. జగన్ పాలనలో నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయని పేర్కొన్నారు. టీడీపీ హయాంలో పేదలకు కట్టించిన ఇళ్లకు కనీసం గృహప్రవేశం కూడా చేయలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉందని విమర్శించారు. టీడీపీ ప్రభుత్వం అమరావతి అనే బంగారు బాతుని పెంచి పోషించి ఇస్తే.. ఆ బంగారు బాతుని చంపేశారని ధ్వజమెత్తారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: