ఏబీఎన్ రాధాకృష్ణ, ఆయన ఆంధ్రజ్యోతి దిన పత్రిక తెలుగుదేశానికి అనుకూలంగా ఉంటాయని.. జగన్ కు ప్రతికూలంగా ఉంటాయన్న సంగతి తెలుగురాష్ట్రాల్లో కాస్తోకూస్తో అవగాహన ఉన్న ప్రతి ఒక్కరికీ తెలిసిందే. అయితే తాజాగా జగన్ సర్కారు ఏపీలో తెలుగు మీడియం ఎత్తేయాలని నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వ బళ్లలోనూ ఇంగ్లీష్ మీడియం పెట్టబోతున్నారు.

 

పేదల పిల్లల కోసం ఇంగ్లీష్ మీడియం పెడుతుంటే.. దాన్ని మతమార్పిడి కుట్రగా ఆంధ్రజ్యోతి పత్రిక ఫోకస్ చేసిందని వైసీపీ మండిపడుతోంది. సాక్షాత్తూ.. విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ ఈ అంశంపై మండిపడ్డారు. ఇష్టం వచ్చినట్టు రాస్తారా.. అంటూ మండిపడ్డారు. ఈ వార్తపై తాము కచ్చితంగా చర్యలు తీసుకుంటామని .. కేసు కూడా పెట్టబోతున్నామని ప్రెస్ మీట్లోనే చెప్పేశారు.

 

మంత్రి ఆగ్రహం చూస్తుంటే ఏబీఎన్ ఆర్కేపై కేసు పెట్టేందుకు రెడీ అయినట్టు కనిపిస్తోంది. అందులోనూ ఆ ఆర్టికల్ స్వయంగా ఆర్కే రాశారు. కాబట్టి ఈ కేసు సంచలనం సృష్టించే అవకాశం ఉంది. ఆంధ్రజ్యోతి తీరుపై మండిపడ్డ మంత్రి ఇంగ్లిష్‌ మీడియంలో చదివితే మతమార్పిడి జరుగుతుందా..? ఇంగ్లిష్‌ మీడియంలో చదివిన వారి పిల్లలు అంతా మతమార్పిడి చేసుకున్నారా..? అని నిలదీశారు.

 

ప్రతిపక్షాలు, పచ్చపత్రికలు కావాలనే ప్రభుత్వంపై బురదజల్లుతున్నాయని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ ధ్వజమెత్తారు. మొన్నటి ఇసుక, ఇంగ్లిష్‌ అంటూ ఆరోపణలు చేసిన ప్రతిపక్షాలు.. ప్రభుత్వంపై బురద జల్లేందుకు ఏ అవకాశం దొరక్కపోవడంతో కొత్తగా మతం అంటూ దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఇంగ్లిష్‌ అనేది ఒక మతానికి, ఒక వర్గానికి అంటూ బురద జల్లేందుకు యత్నించడం దుర్మార్గమన్నారు. మారుతున్న సమాజం, టెక్నాలజీని దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రవేశ పెట్టనున్నారని చెప్పారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: