ఏపీ సీఎం జగన్ పాలనాపగ్గాలు చేపట్టి ఆరు నెలలు కావస్తోంది. ఈ తక్కువ సమయంలోనే ఆయన తనదైన ముద్రవేశారు. గత ప్రభుత్వం చేసిన తప్పిదాలు సరిచేస్తున్నానంటూ కొన్ని ఒప్పందాలను సమీక్షించేందుకు ప్రయత్నించారు. ఇందులో కొన్ని అంతర్జాతీయ ఒప్పందాలు కూడా ఉన్నాయి. చంద్రబాబు సర్కారు ఇష్టారాజ్యంగా ప్రభుత్వానికి భారం పడేలా ఒప్పందాలు కుదుర్చుకున్నామని వాటిని సమీక్షిస్తామని చెప్పారు.

 

ఇందులో ఎక్కువగా విద్యుత్ పీపీఏలు ఉన్నాయి. అయితే ఇలా చేయడం ద్వారా భారత్‌లో విదేశీ కంపెనీల పెట్టుబడులకు రక్షణ ఉండదన్న వాదన వినిపిస్తోంది. దీనిపై గతంలో కేంద్రమంత్రి ఆర్కే సింగ్ కూడా జగన్ ను వారించారు. పాత ఒప్పందాలను పునఃసమీక్షించాలంటూ జగన్‌ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం విదేశీ పెట్టుబడిదారులకు తప్పుడు సంకేతాలనిచ్చిందని ఆయన అన్నారట. విదేశాల నుంచి పెట్టుబడులను ఆకర్షించడంలో భారత్‌ సామర్థ్యాన్ని కొంత దెబ్బతీసిందని చెప్పారట.

 

జగన్ చర్య చట్టపరమైన ఒప్పందాలకు కట్టుబడి ఉంటారన్న నమ్మకం సన్నగిల్లేలా చేసిందని.. . దేశమంతటా అమలయ్యేలా కేంద్ర ప్రభుత్వం పటిష్ఠ చట్టాన్ని తీసుకొస్తేనే భారత్‌ తిరిగి విదేశీ మదుపర్లలో విశ్వాసాన్ని నింపగలదని కేంద్ర విద్యుత్తు శాఖ సహాయమంత్రి ఆర్‌.కె.సింగ్‌ తాజాగా అన్నట్టు ఆ పత్రికలు రాసుకొచ్చాయి. ఇప్పుడు భారత్‌లో విదేశీ కంపెనీల పెట్టుబడులకు రక్షణ కల్పించేలా త్వరలో కేంద్ర ప్రభుత్వం కఠిన చట్టాన్ని తీసుకురాబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. భారత్ లో తమ పెట్టుబడులకు తగిన రక్షణ ఉండడం లేదని కొన్ని విదేశీ సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నందుకే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని కొన్ని పత్రికలు రాశాయి.

 

ఆంధ్రప్రదేశ్‌లో గత ప్రభుత్వ హయాంలో కుదిరిన విద్యుత్తు కొనుగోలు ఒప్పందాల పునఃసమీక్షించాలంటూ సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి నేతృత్వంలోని ప్రస్తుత ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడాన్ని కేంద్రం తీవ్రంగా పరిగణించినట్లు ఆ పత్రికలు చెబుతున్నాయి. ఇలాంటి చర్యలతో భారత్ లోకి విదేశీ పెట్టుబడులు దూరమయ్యే ముప్పుందని కేంద్రం భావింస్తోందట. భవిష్యత్తులో ఏ రాష్ట్రంలోనూ ఆ పరిణామాలు చోటుచేసుకోకుండా కఠిన చట్టాన్ని తీసుకోవాలని డిసైడైందట. విదేశీ పెట్టుబడిదారుల విశ్వాసాన్ని చూరగొనేందుకు కొత్త చట్టం తేబోతోందట.

మరింత సమాచారం తెలుసుకోండి: