అరాచకమే చంద్రబాబు ఆదర్శమా ?

 

 

మాజీ ఎంఎల్ఏ చింతమనేని ప్రభాకర్ ను అందరూ ఆదర్శంగా తీసుకోవాలని చంద్రబాబునాయుడు చెప్పటమే విచిత్రంగా ఉంది. చింతమనేని ప్రభాకర్ అనే వ్యక్తి ఓ అరాచక వాది. అధికారాన్ని అడ్డుపెట్టుకుని చంద్రబాబు తరచూ చెబుతుండే ఆంబోతు లాగ ప్రత్యర్ధులపై విరుచుకుపడేవాడు. ప్రత్యర్ధులంటే ఇక్కడ వైసిపి అనే కాదు. అధికారులు కూడా చింతమనేనికి ప్రత్యర్ధుల క్రిందే లెక్క.

 

ఎలాగంటే ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనే అధికారులను కూడా నోటికొచ్చినట్లు మైకుల్లో బూతులు తిట్టేవాడు. దిగువస్ధాయి సిబ్బంది మీద చేయికూడా చేసుకున్నారు. సరే ఇక రాజకీయ ప్రత్యర్ధులపై చేసిన దాడులకైతే లెక్కేలేదు. మొత్తం మీద 10 ఏళ్ళ ఎంఎల్ఏ కాలంలో అరాచకం అంటే ఏమిటో దెందులూరు నియోజకవర్గంలో చింతమనేని బాగా తెలియజేశారు.

 

మాజీ ఎంఎల్ఏ ధౌర్జన్యాలు తట్టుకోలేక ఎవరైనా ఫిర్యాదులు చేయటానికి పోలీసు స్టేషన్లకు వెళితే కనీసం ఫిర్యాదును కూడా పోలీసులు తీసుకోలేదు. పోలీసులను, అధికారాన్ని అడ్డం పెట్టుకుని చింతమనేని చేయని అరాచకం లేదు. పోలీసులనే కాదు, ఫారెస్టు అధికారులను కూడా  కొట్టాడు. ఇసుక మైనింగ్ సందర్భంలో అప్పటి ఎంఆర్వో వనజాక్షిని జుట్టుపట్టుకుని ఈడ్చి కొట్టిన విషయం సంచలనమే.

 

అధికారంలో ఉన్నాడు కాబట్టి ఐదేళ్ళు ఎటువంటి ఇబ్బంది లేకుండా నెట్టుకొచ్చేశాడు. ఎప్పుడైతే టిడిపి ఘోరంగా ఓడిపోయిందో అప్పటినుండే మాజీ ఎంఎల్ఏ తలరాత కూడా మారిపోయింది. పదేళ్ళపాటు సమస్యలు ఎదుర్కొన్న బాధితులందరూ ఒక్కసారిగా పోలీసు స్టేషన్ మెట్లెక్కారు. వరుసబెట్టి ఫిర్యదులు చేయటంతో చింతమనేని మీద సుమారు 60 కేసులు నమోదయ్యాయి.

 

ఇందులో 15 కేసులు ఎస్సీ, ఎస్టీ వేధింపుల కేసులే కావటం గమనార్హం. ఈ కేసుల్లోనే చింతమనేని సుమారు 65 రోజులు రిమాండ్ లో ఉండి సోమవారమే జైలు నుండి విడుదలయ్యారు. ఇంకా చాలా కేసుల్లో విచారణను ఎదుర్కొంటున్నారు. ఏ కేసులో ఎప్పుడు రిమాండ్ పడుతుందో చెప్పలేరు. అలాంటి అరాచకవాది చింతమనేనే  అందరికీ ఆదర్శమని చంద్రబాబు చెప్పటమే ఆశ్చర్యంగా ఉంది.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: