ఢిల్లీ ప్ర‌జ‌ల‌ను వాయుకాలుష్యం వ‌ణికిస్తోంది... సహ‌జంగానే న‌వంబ‌ర్ మాసంలో చ‌లికి వ‌ణికిపోయే జ‌నాలు గ‌త కొన్నాళ్లుగా వాయుకాలుష్యం పెరిగిపోవ‌డంతో త‌రుచూ అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్నారు.  ఊపిరి సంబంధిత వ్యాధుల‌తో అల్లాడిపోతున్నా రంటే ఢిల్లీలో ఏ స్థాయిలో వాయుకాలుష్యం జ‌రుగుతోందో అర్థం చేసుకోవ‌చ్చు. విద్యార్థుల‌ను బ‌డికి పంపాలంటే త‌ల్లిదండ్రులు  ఇష్ట‌పడ‌టం లేదు. ఒక వేళ ధైర్యం చేసి పంపినా నాలుగైదు రోజుల్లో అనారోగ్యం పాల‌వుతున్నారు. 

 

గ‌త ఏడాది నుంచి న‌వంబ‌ర్ మాసంలో రెండు వారాల పాటు స్కూళ్ల‌కు సెల‌వుల‌ను ప్ర‌క‌టిస్తూ వ‌స్తోంది అక్క‌డి కేజ్రీవాల్ ప్ర‌భుత్వం.  అయితే త‌ద‌నుగుణంగా ఈసెల‌వుల‌ను మిగ‌తా రోజుల్లో పూడ్చుకోవాల్సి ఉన్నా ఎందుక‌నో ప్ర‌భుత్వం చ‌ర్య‌లు తీసుకోవ‌డం లేదు. దీంతో విద్యార్థులు చ‌దువు విష‌యంలో న‌ష్ట‌పోతున్నార‌నే వాద‌న‌లు వినిపిస్తున్నాయి. పిల్లల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని వైద్యుల సూచనల మేరకు పేరెంట్స్  తాజా డిమాండ్ తెర‌పైకి తీసుకువ‌చ్చారు. 

 

ప్రతీ సంవత్సరం నవంబర్ మొదటి రెండు వారాల్లో పాఠశాలలకు ‘స్మోగ్ బ్రేక్’ షెడ్యూల్ చేయాలని నేషనల్ కాపిటల్ రీజియన్ (ఎన్సీఆర్) ను చాలా మంది తల్లిదండ్రులు చెబుతున్నారు. కాలుష్య వెదజల్లే చలికాలంలో పిల్లలను స్కూలుకు పంపమని.. ఇతర కాలాల్లో సెలవులను పొడిగించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. లేకుంటే విద్యార్థులు నష్టపోతారని అంటున్నారు.  మరి దీనిపై ఎన్సీఆర్ ఢిల్లీ ప్రభుత్వాలు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాయనేది ఆసక్తిగా మారింది. 

 

వాహ‌నాల ద్వారా వెలువ‌డే కాలుష్యాన్ని త‌గ్గించేందుకు కేజ్రీవాల్ ప్ర‌భుత్వం ఎన్నో చ‌ర్య‌లు చేప‌డుతోంది. స‌రిబేసి విధానంతో కొద్దిమేర లాభం చేకూరుతున్నా స‌మ‌స్య‌కు ప‌రిష్కారం ల‌భించ‌డం లేదు. మ‌రికొద్దిరోజులు ఇలాగే ఉంటే ఢిల్లీ వాసులు మెల్ల‌గా ఇత‌ర ప్ర‌దేశాల‌కు వెళ్లాల్సి వ‌స్తుంద‌ని, ఉండాల‌నుకునే వారు అనారోగ్యంతో చ‌చ్చిపోతారంటూ స్వ‌చ్ఛంద సంస్థ‌ల ప్ర‌తినిధులు, ప‌ర్యార‌ణ వేత్త‌లు మండిప‌డుతున్నారు. ఢిల్లీలో ఇటీవ‌ల జోరుగా ఆక్సిజ‌న్ కిట్ల అమ్మ‌కాలు పెర‌గ‌డం అక్క‌డి తీవ్ర‌త‌కు అద్దం ప‌ట్టే విష‌యంగా చెప్ప‌వ‌చ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: