తాడికొండ వైసీపీ పార్టీ ఎమ్మెల్యే శ్రీదేవిపై విచారణ జరగనుంది. శ్రీదేవి ఎస్సీ కాదంటూ లీగల్ రైట్స్ ఫోరం రాష్ట్రపతికి ఫిర్యాదు చేసింది. రాష్ట్రపతి కార్యాలయం ఈ విషయం గురించి నివేదిక ఇవ్వాలని సీఎస్ కు ఆదేశాలు జారీ చేసింది. గుంటూరు జిల్లా జాయింట్ కలెక్టర్ ఈ నెల 26వ తేదీన శ్రీదేవి విచారణకు హాజరు కావాలని ఆదేశాలు ఇచ్చారు. గుంటూరు జిల్లా జాయింట్ కలెక్టర్ దినేష్ కుమార్ శ్రీదేవి ఎస్సీ అని నిరూపించుకునేందుకు తగిన ఆధారాలతో రావాలని సూచించారు. 
 
గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గానికి ప్రస్తుతం ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న ఉండవల్లి శ్రీదేవి ఎస్సీ కాదంటూ కొందరు రాష్ట్రపతి కార్యాలయానికి వెళ్లి ఫిర్యాదు చేశారు. లీగల్ రైట్స్ ఫోరంకు చెందిన సభ్యులు ప్రధానంగా తాడికొండ ఎమ్మెల్యే ఎస్సీ కాదంటూ ఫిర్యాదు చేసి విచారణ చేపట్టాలని కోరినట్లు తెలుస్తోంది. కొన్ని రోజుల క్రితమే విచారణ చేసి నివేదిక ఇవ్వాలని రాష్ట్రపతి కార్యాలయం నుండి ఏపీ సీఎస్ కు ఆదేశాలు జారీ అయ్యాయి. 
 
వినాయకచవితి పండుగ సమయంలో పూజా కార్యక్రమానికి వెళ్లిన శ్రీదేవిని కొందరు కులం పేరుతో దూషించారని ఎమ్మెల్యే కొందరు గ్రామస్థులపై ఫిర్యాదు చేసింది. లీగల్ రైట్స్ ఫోరం సభ్యులు ఉండవల్లి శ్రీదేవి ఎస్సీ కానప్పటికీ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కింద కేసు నమోదు చేశారని రాష్ట్రపతి కార్యాలయాన్ని ఆశ్రయించారు. గతంలో శ్రీదేవి ఒక ఇంటర్వూలో తన భర్త కాపు కులానికి చెందిన వ్యక్తి అని చెప్పినట్లు తెలుస్తోంది. 
 
ఎన్నికల కమిషన్ కు కూడా కొందరు శ్రీదేవి ఎస్సీ కాకపోయినా ఎస్సీలకు కేటాయించిన నియోజకవర్గం నుండి శ్రీదేవి పోటీ చేసిందని ఫిర్యాదు చేశారని తెలుస్తోంది. శ్రీదేవి తన దగ్గర ఉన్న పూర్తి ఆధారాలతో 26వ తేదీన మధ్యాహ్నం 
3 గంటలకు హాజరు కావాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ నెల 26వ తేదీన జరిగే విచారణలో ఉండవల్లి శ్రీదేవి ఎలాంటి ఆధారాలు చూపుతుందో చూడాల్సి ఉంది. ఎమ్మెల్యే శ్రీదేవి మాత్రం తనపై కొందరు కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నట్లు తెలుస్తోంది. 
 

మరింత సమాచారం తెలుసుకోండి: