ఎవరైనా తమపై కోర్టులో కేసులు పడితే  ఏం చేస్తారు ? తమపై పెట్టిన కేసు తప్పుడు కేసని నిరూపించుకుంటారు. కాని చంద్రబాబునాయుడు ఏం చేస్తారు ? తనపై కేసు పెట్టే అర్హతే సదరు ఫిర్యాదుదారుకి లేదని ఎదురు వాదిస్తారు. అంతే తప్ప తనపై పెట్టింది తప్పుడు కేసని వాదించరు. తనపై పెట్టిన కేసు ఏ విధంగా తప్పుడు కేసో చెప్పరు. అదే చంద్రబాబు స్టైల్.

 

బహుశా ఇటువంటి స్టైల్లో కోర్టు కేసుల్లో విచారణ జరగకుండా స్టేలు తెచ్చుకుని కంటిన్యు అవుతున్న రాజకీయ నేత ఇంకోళ్ళుండరేమో. తనపై కోర్టులో కేసులు విచారణ జరగకుండా అడ్డుకోవటంలోను స్టేలు తెచ్చుకోవటంలో మాత్రం చంద్రబాబుది ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని అందరూ ఒప్పుకోవాల్సిందే.

 

చంద్రబాబు ప్రత్యర్ధుల ఆరోపణల ప్రకారం చంద్రబాబు ఇప్పటి వరకూ 18 కేసులు కోర్టుల్లో నమోదయ్యాయి. ఏ ఒక్క కేసులో కూడా విచారణ జరగకుండా ఈ మాజీ సిఎం ఎప్పటికప్పుడు అడ్డుకుంటునే ఉన్నారు. మరి దేశంలో ఎవరికీ ఇంతటి వెసులుబాటు ఇవ్వని న్యాయ వ్యవస్ధ ఒక్క చంద్రబాబు మీదే ఎందుకింత ప్రమే కురిపిస్తోందో ఎవరికీ అర్ధం కావటం లేదు.

 

తాజాగా అక్రమాస్తుల కేసులో గతంలో లక్ష్మీపార్వతి దాఖలు చేసిన కేసును ఏసిబి న్యాయస్ధానం రేపు 25వ తేదీన విచారణ జరపనుంది. ఈ కేసును లక్ష్మీపార్వతి 14 సంవత్సరాల క్రితం వేశారు. ఎప్పటికప్పుడు విచారణ జరగకుండా చంద్రబాబు మ్యానేజ్ చేస్తునే ఉన్నారు ఇన్ని ఏళ్ళూ. కాకపోతే ఆమధ్య సుప్రింకోర్టు ఇచ్చిన ఓ రూలింగ్ రూపంలో చంద్రబాబుకు ఇబ్బందులు మొదలయ్యాయి.

 

క్రిమినల్ కేసుల విచారణలో 6 మాసాలకు మించి స్టే ఇవ్వకూడదన్న నిబంధన వల్లే ఇపుడు చంద్రబాబుపై విచారణ మొదలవ్వబోతోంది. సరే ఈ కేసు విచారణ మొదలైనంత మాత్రానా చంద్రబాబుకు ఏమో అయిపోతుందని అనుకునేందుకు లేదులేండి. ఎందుకంటే చంద్రబాబు ఇటువంటి విచారణలకు అతీతుడు. ఓటుకునోటు కేసులో అడ్డంగా తగులుకుంటేనే చంద్రబాబుకు ఏమీ కాలేదు. మరి అక్రమాస్తుల కేసుల విచారణలో ఏమవుతుంది ?

మరింత సమాచారం తెలుసుకోండి: