సియాచిన్‌ గ్లేసియర్‌లో మంచు చరియలు విరిగిపడిన ఘటనలో ఆరుగురు చనిపోయారు. ఇందులో నలుగురు ఇండియన్‌ ఆర్మీ జవాన్లు కాగా... మిగతా ఇద్దరు సామాన్లు మోసే కూలీలు. తీవ్రంగా గాయపడ్డ మరో ఇద్దరు సైనికుల పరిస్థితి విషమంగా ఉంది. సియాచిన్‌ గ్లేసియర్‌లో విధులు నిర్వహిస్తున్న భారత జవాన్లు అనూహ్యంగా ప్రమాదానికి గురయ్యారు. అకస్మాత్తుగా వచ్చిన అవలాంచి... ఇండియన్‌ ఆర్మీ పోస్టును మంచుతో కప్పేసింది. దీంతో ఎనిమిది మంది సైనికులతో పాటు ఇద్దరు కూలీలు దట్టమైన మంచు కింద చిక్కుకుపోయారు.    

 

సమాచారం అందిన వెంటనే అక్కడికి చేరుకున్న రెస్క్యూ బృందాలు... ఆరుగురు సైనికులతో పాటు సరుకులు మోసే ఇద్దరు కూలీలను బయటకు తీశారు. అయితే... అప్పటికే  హైపోథెర్మియా వల్ల నలుగురు సైనికులు చనిపోయినట్టు గుర్తించాయి రెస్క్యూ బృందాలు. మిగతా ఇద్దరు సైనికులతో పాటు ఇద్దరు కూలీలను హెలికాప్టర్లో దగ్గర్లోని మిలిటరీ ఆస్పత్రికి తరలించారు.  అయితే... కొద్ది సేపటికే ఇద్దరు కూలీలు కూడా ప్రాణాలు విడిచారు. చికిత్సపొందుతున్న మిగతా సైనికుల పరిస్థితి కూడా విషమంగా ఉంది.   

 

సియాచిన్‌ గ్లేసియర్‌ సముద్ర మట్టానికి దాదాపు 19 వేల అడుగుల ఎత్తులో ఉంది. ప్రపంచంలోనే ఇది అత్యంత ఎత్తైన యుద్ధభూమి. ఇక్కడ వాతావరణ పరిస్థితులు చాలా ప్రమాదకరంగా ఉంటాయి. ఆక్సీజన్‌ లభ్యత కూడా తక్కువగా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఉష్ణోగ్రత మైనస్‌ 60 డిగ్రీలకు పడిపోతుంది. ఇటువంటి సమయాల్లోనే అవలాంచిలు సంభవిస్తుంటాయి. పర్వత శిఖరాల నుంచి పెద్ద మొత్తంలో మంచు కింది కొట్టుకొస్తుంది. కొన్ని అడుగుల మేరకు దట్టంగా కప్పేసే మంచు కింద చిక్కుకున్న వాళ్లకు తప్పించుకోడానికి అవకాశమే ఉండదు.   

 

2016లో సియాచిన్‌ గ్లేసియర్‌లోని సోనమ్‌ పోస్టు వద్ద కూడా ఇదే తరహాలో ప్రమాదం జరిగింది. అకస్మాత్తుగా వచ్చిన అవలాంచి పది మంది సైనికుల్ని పొట్టనపెట్టుకుంది. 35 అడుగుల మంచు కింద చిక్కుకుపోయిన సైనికుల్ని వెలికి తీయడానికి రెస్క్యూ బృందాలకు ఐదు రోజులు పట్టింది. అయితే... 9 మంది సైనికులు అప్పటికే చనిపోగా... లాన్స్‌నాయక్‌ హనుమంతప్ప మాత్రం కొన ఊపిరితో ఉన్నారు. అతన్ని హుటాహుటిన ఢిల్లీలోని ఆర్మీ ఆస్పత్రికి తరలించారు. కానీ... గాయాల కారణంగా ఆయన 3 రోజుల పాటు మృత్యువుతో పోరాడి ఓడిపోయారు.  తాజా ప్రమాదంలో నలుగురు సైనికులు సహా ఆరుగురు చనిపోవడం సియాచిన్‌ ఎంత ప్రమాదకరమైనదో మరో సారి గుర్తు చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: