తెలంగాణా రాష్ట్రంలో మద్యం అమ్మకాలను మరింత పెంచడంతో పాటు భారీగా ఆదాయాన్ని సమకూర్చుకునే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. అందుకుగాను మద్యం ధరల ను సవరించే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. దీని వల్ల త్వరలో రాష్ట్రంలో మద్యం ధరలు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

 

 

తెలంగాణ ఆదాయాన్ని పెంచుకునే భాగంగా తెలంగాణ  ప్రభుత్వం దీనికి సంబంధించి ముగ్గురు మంత్రు లతో కూడిన కేబినెట్‌ సబ్‌ కమిటీని ఏర్పాటు చేసి మద్యం ధరలను నిర్ధారించే బాధ్యతలను అప్పగించనుంది. త్వరలోనే ఏర్పాటు కానున్నా సబ్‌కమిటీ సిఫారసులతో సీఎం కేసీఆర్‌ నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. మున్సిపల్‌ ఎన్నికల షెడ్యూల్‌ను బట్టి మద్యం ధరల సవరణపై నిర్ణయం తీసుకోనున్నారు.

 

 

త్వరలోనే ఎన్నికలు వస్తే అవి ముగిసిన తర్వాత సవరించాలని, మున్సిపల్‌ ఎన్నికల నోటిఫికేషన్‌కు ఆలస్యం జరిగితే వీలున్నంత త్వరలో నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టు సమాచారం. ఇకపోతే కొత్త మద్యం విధానం అమల్లోకి వచ్చిన వెంటనే మద్యం ధరల పెంపుపై కొంత కసరత్తు చేసిన ఎక్సైజ్‌ శాఖ ఇప్పటికే వివిధ రకాల మద్యం ధరలను 5-10 శాతం వరకు పెంచే ప్రతిపాదనలు సిద్ధం చేసింది.

 

 

వీటిని ఆమోదిస్తే  ప్రభుత్వ ఖజానాకు ఏటా రూ. 1,200-1,700 కోట్ల వరకు అదనపు ఆదాయం చేరుతుందని ఆ వర్గాల అంచనా.  ఇదీగాక మరోవైపు కొత్త మున్సిపల్‌ చట్టం ద్వారా ఏర్పాటైన 73 మున్సిపాలిటీల్లో కూడా బార్‌ నోటిఫికేషన్‌ రానుంది. దీనిపై త్వరలో నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది.

 

 

హైదరాబాద్ తో పాటు శివార్లలో, రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో నిర్వహించే ఈవెంట్లను వర్గీకరించాలని, ఈవెంట్ల స్థాయిని బట్టి ఫీజును సవరించేందుకు చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో మద్యం ధరల పెంపు, కొత్త మున్సిపాలిటీల్లో బార్లకు నోటిఫికేషన్, ఈవెంట్‌ చార్జీల పెంపు ద్వారా వీలైనంత ఎక్కువ ఆదాయం రాబట్టుకునేందుకుగాను రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే నిర్ణయం తీసుకోనుందని తెలుస్తోంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: