వీరసావర్కర్‌కు భారతరత్న కోసం ప్రయత్నిస్తామన్న బీజేపీ మాట నిల‌బెట్టుకుంటోంది.  మ‌హారాష్ట్ర ఎన్నిక‌ల స‌మ‌యంలో ఈ ప్ర‌తిపాద‌న తెర‌మీద‌కు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. మహారాష్ట్ర ఎన్నికలకు సంబంధించి బీజేపీ విడుదల చేసిన మేనిఫెస్టోలో  తాము అధికారంలోకి వస్తే వీర్ సావర్కర్‌కు భారతదేశ అత్యున్నత పురస్కారం 'భారత రత్న' అవార్డు వచ్చే కృషి చేస్తామని హామీ ఇచ్చింది. అంతేకాదు జ్యోతిబా పూలే, సావిత్రభాయ్ పూలేకు భారత రత్న సాధించడమే లక్ష్యమని తెలిపింది. ఈ మేర‌కు హిందుత్వం కోసం పనిచేసిన సావ‌ర్క‌ర్‌కు కేంద్రంలోని మోదీ ప్ర‌భుత్వం ఓకే చెప్పిన‌ట్లు జాతీయ మీడియా క‌థ‌నాలు వెలువ‌రిస్తోంది. 

 

సావ‌ర్క‌ర్‌కు అవార్డు ఇవ్వ‌డం రాజకీయ దుమారం రేపిన సంగ‌తి తెలిసిందే. సావర్కర్‌కు అవార్డు ఇచ్చేందుకు కేంద్రం నిర్ణయించిందని బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్యస్వామైతే ఏకంగా ట్విటర్‌లో పేర్కొన్నారు. ఆయనతో పాటు మరో బీజేపీ నేత మేజర్ సురేంద్ర పునియా సైతం సావర్కర్‌కు భారతరత్న అవార్డు రాబోతోందని ట్వీట్ చేశారు. వీరసావర్కర్‌కు భారతరత్న ప్రతిపాద‌న‌పై అప్ప‌ట్లోనే ఏఐఎంఐఎం అధ్యక్షుడు, ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ అభ్యంతరం వ్యక్తం చేశారు. హిందుత్వం కోసం పనిచేసిన వీరసావర్కర్‌కు భారతరత్న ఇవ్వదల్చుకున్నప్పుడు నాథూరాం గాడ్సేకు కూడా భారతరత్న ఇవ్వొచ్చుగా అని ఎద్దేవా చేశారు. ‘రెండు జాతుల సిద్ధాంతాన్ని తొలుత సావర్కర్‌ పరిచయం చేశారు. అనంతరం మహ్మద్‌ అలీ జిన్నా అనుసరించారు. ఎవరికైనా భారతరత్న ఇవ్వాలని మీరనుకుంటే గాడ్సేకు కూడా ఇవ్వండి. బీజేపీ హిందుత్వ సిద్ధాంతాలను సావర్కర్‌ రాశారు. సిద్ధాంతాల ప్రాతిపదికన అవార్డులు ఇవ్వడం సరికాదు` అని ఆక్షేపించారు. సావర్కర్‌కు భారతరత్న ఇవ్వాలన్న ప్రతిపాదనపై కాంగ్రెస్ స్పందించింది. స్వాతంత్య్ర సమరయోధులైన భగత్‌సింగ్, రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌కు అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్నను ఇవ్వాలని కాంగ్రెస్ అధికార ప్రతినిధి మనీశ్ తివారీ ప్రధాని మోదీకి ఓ లేఖ రాశారు.  గాంధీజీ హత్య కేసులో సావర్కర్ అరెస్టయ్యారని.. సావార్కర్ ప్రమేయంపై జీవన్‌లాల్ కమిషన్ అనుమానాలు వ్యక్తం చేసిందని కాంగ్రెస్‌ పార్టీ నేత గుర్తు చేశారు. 1949లో గాంధీ హత్యలో కేసులో వీర్ సావర్కర్‌ను అరెస్ట్ చేశారు. ఐతే తగిన ఆధారాలు లేకపోవడంతో ఆయన్ను నిర్దోషిగా విడుదల చేశారు. 

 


26 జనవరి, 2020 నాడు భారతరత్న పురస్కారాన్ని ప్ర‌దానం చేయ‌నున్నారు. భార‌త అత్యున్న‌త పుర‌స్కార‌మైన ఈ అవార్డుకు సావ‌ర్క‌ర్‌ను ఖ‌రారు చేసిన‌ట్లు స‌మాచారం. ప్ర‌తిపాద‌న పంపాల్సిన అవ‌స‌రం లేకుండానే...ఆయ‌న్ను ఎంపిక చేసిన‌ట్లు తెలుస్తోంది. కాగా, ఈ విష‌యంలో కేంద్రం అధికారిక ప్ర‌క‌ట‌న వెలువ‌రించాల్సి ఉంది. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: