అప్పట్లో సొంత పార్టీ ఎంపీతో విభేదాలు.. తరువాత తోటి శాసన సభ్యురాలితో పట్టింపులు... ఇప్పుడు ఏకంగా కుల వివాదం... ఇలా వరుస వివాదాలతో రాజధాని ప్రాంత ఎమ్మెల్యే శ్రీదేవి నిత్యం వార్తల్లోకి వస్తున్నారు. శ్రీదేవి శాసన సభ్యురాలుగా ఎన్నికయిన కులం ఆమెకు వర్తించదంటూ ఏకంగా రాష్ట్రపతి వరకు ఈ వ్యవహారం వెళ్లింది. దీంతో ఆమెను విచారించేందుకు జిల్లా జాయింట్ కలెక్టర్ డేట్ ఫిక్స్ చేసి... హాజరు కావాలని కబురు పంపారు. 

 

అమరావతి ప్రాంతంలో అత్యంత కీలకమయిన తాడికొండ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న వైసీపీ ఎమ్మెల్యే  శ్రీదేవిని వరుస వివాదాలు వెంటాడుతున్నాయి. గతంలో తన నియోజకవర్గంలో పార్టీలోని మరో వ్యక్తి హడావిడి చేయటం పై ఆమె మండిపడ్డారు. వినాయక చవితి సాక్షిగా చెలరేగిన వివాదంలో కూడ శ్రీదేవి తనకు అవమానం జరిగిందంటూ తీవ్ర స్దాయిలో వివాదాన్ని రాజేశారు. అది కాస్తా రాజకీయం కావటంతో రెండు ప్రధాన పార్టీల మధ్య విభేదాలొచ్చాయి. ఇక్కడ కూడ శ్రీదేవి దూకుడుగా వ్యవహరించారనే ప్రచారం ఉంది. వినాయకుడి మండపం వద్ద జరిగిన గొడవ ఎమ్మెల్యే వెళ్లిన తరువాత జరిగింది. అయితే అది ఎమ్మెల్యే శ్రీదేవిని ఉద్దేశించి జరిగిందేనని పార్టి శ్రేణులు వక్రీకరిచంటంతో.. రాష్ట్ర స్థాయిలో చర్చకు దారితీసింది. 


దీనిపై ఎమ్మెల్యే శ్రీదేవికి వ్యతిరేకంగా మరోక వర్గం ఏకంగా రాష్ట్రపతికి ఫిర్యాదు చేసింది. దీంతో రాష్ట్రపతి భవన్ కుల పరమయిన వ్యవహరాన్ని తేల్చాలని ఎన్నికల సంఘానికి సూచించింది. ఎన్నికల సంఘం నుంచి ఆదేశాలు రావడంతో.. విచారణ బాధ్యతల్ని కలెక్టర్ జాయింట్ కలెక్టర్ కు అప్పగించారు.  దీనిపై వివరాలు అందించేందుకు ఈ నెల 26వ తేదీన వ్యక్తి గతంగా హజరు కావాలని ఆదేశాలు ఇచ్చారు. వచ్చే సమయంలో కులధృవీకరణ పత్రాలు, కుటుంబ సభ్యులను కూడ వెంట తెచ్చుకోవాలని స్పష్టం చేశారు .దీంతో శ్రీదేవి వర్గంలో ఒక్క సారిగా కలకలం రేగింది. అధికార పార్టీకి చెందిన మహిళా శాసన సభ్యురాలు ఇలా కులపరమయిన ఇబ్బందుల్లో పడటం.. అది కూడా చాలా సున్నితమయిన అంశం కావటంతో ఏం జరుగుతుందోననే ఉత్కంఠ నెలకొంది. 

 

శాసన సభ్యురాలిగా ఎన్నికయిన ఉండవల్లి శ్రీదేవిది మెదటి నుంచీ భిన్నమయిన మనస్తత్వం. తన నియోజకవర్గంలో ఇతరుల ప్రమేయాన్ని ఆమె తీవ్రంగా ప్రతిఘటిస్తున్నారు. తన కోటలో మరొకరు జోక్యం చేసుకున్నా,.. తనకు సమాచారం లేకుండా వచ్చినా ఆమె ఇబ్బందిగానే ఫీల్ అవుతారు. కుల పరమయిన వ్యవహరం పై ఇప్పటికే శ్రీదేవి చాలా క్లారిటీగా ఉన్నారని అంటున్నారు. సాంకేతికంగా, న్యాయపరంగా అన్ని కోణాల్లో తాను ఎస్సీ అని నిరూపించే విధంగా బలమయిన ఆధారాలు కూడ సేకరించారని చెబుతున్నారు. ఇవే విషయాలను జాయింట్ కలెక్టర్ దృష్టికి కూడ తీసుకువెళతామని శ్రీదేవి సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: