రాజ్యసభ మార్షల్స్‌కు సైనికాధికారుల తరహాలో ఉండే నూతన డ్రెస్‌కోడ్‌పై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ఈ అంశంపై స్పందించిన రాజ్యసభ ఛైర్మన్‌ వెంకయ్యనాయుడు.. డ్రెస్‌కోడ్‌ మార్పు నిర్ణయాన్ని పునఃసమీక్షిస్తామని స్పష్టం చేశారు. 

 

మార్షల్స్‌ వస్త్రధారణపై అనేక సలహాలు, సూచనలను పరిగణనలోకి తీసుకున్న అనంతరం రాజ్యసభ సెక్రటేరియట్‌ వారికి కొత్త డ్రెస్‌కోడ్‌ తీసుకొచ్చింది. అయితే దీనిపై కొన్ని రాజకీయ పార్టీలు, కొంతమంది ప్రముఖుల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అందువల్ల డ్రెస్‌కోడ్‌ మార్పుపై మరోసారి ఆలోచించాలని సెక్రటేరియట్‌కు చెప్పినట్టు.. ఛైర్మన్ వెంకయ్య నాయుడు తెలిపారు. 

 

రాజ్యసభ 250వ సమావేశం సందర్భంగా సోమవారం నుంచి ఆ సభ మార్షల్స్‌కు నూతన డ్రెస్‌కోడ్‌ అమల్లోకి తెచ్చారు. సభాధ్యక్ష స్థానంలో ఉన్నవారితో పాటు.. సభ సచివాలయ సిబ్బందికి సహకరించే మార్షల్స్‌ ఇదివరకు సఫారీ దుస్తులు, తలపాగాతో కన్పించేవారు. అయితే దీన్ని మార్చాలని మార్షల్స్‌ కోరడంతో.. సైనిక అధికారుల తరహా వస్త్రధారణను తీసుకొచ్చారు. సైన్యంలో బ్రిగేడియర్‌ ర్యాంక్‌, అంతకంటే పై స్థాయి అధికారులు ఇలాంటి దుస్తులనే ధరిస్తారు. 

 

అయితే ఈ డ్రెస్‌కోడ్‌పై మాజీ సైనికాధికారుల నుంచి విమర్శలు వచ్చాయి. మిలిటరీ యునిఫాంను మిలిటరీయేతర వ్యక్తులు ధరించడం చట్టవిరుద్ధమనీ, భద్రత రీత్యా ప్రమాదకరమని మాజీ ఆర్మీ చీఫ్ లు ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు డ్రెస్‌కోడ్‌ అంశంపై రాజ్యసభలోనూ విపక్ష సభ్యులు ఆందోళన చేశారు.

మరి రాజ్యసభ ఛైర్మన్, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు డ్రెస్ కోడ్ పై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. విపక్షాల విమర్శలను తోసిపుచ్చని వెంకయ్య.. వారు చెప్పే మాటలను కూడా పరిగణలోకి తీసుకున్నారు. ఈ డ్రెస్ కోడ్ వివాదాన్ని పరిష్కరించే దిశగా అడుగులు వేస్తున్నారు. పలువురితో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పకనే చెప్పారు. డ్రెస్ కోడ్ లో పూర్వ పంథానే కొనసాగిస్తారా? లేక కొత్త నిర్ణయం తీసుకుంటారా అనేది ఆసక్తిగా మారింది. 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: