గాంధీ కుటుంబానికి ఎస్పీజీ భద్రత ఉపసంహరణపై కాంగ్రెసె లోక్ సభలో ఆందోళనకు దిగింది. గాంధీ కుటుంబాన్ని ప్రజలకు దూరం చేసే కుట్రకు తెరతీశారని ఆగ్రహం వ్యక్తం చేసింది. వెల్ లోకి దూసుకొచ్చిన కాంగ్రెస్ సభ్యులు.. ప్రధాని, హోం మంత్రి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అమిత్ షా సభ నుంచి వెళ్లిపోవడంతో.. కాంగ్రెస్ సభ్యులు కూడా వాకౌట్ చేశారు.

 

ప్రతిపక్షాల ఆందోళనలతో లోక్‌సభలో గందరగోళ వాతావరణం నెలకొంది. కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ, రాహుల్‌, ప్రియాంకకు ఎస్పీజీ భద్రతను ఉపసంహరించడంపై కాంగ్రెస్‌ ఎంపీలు లోక్‌సభలో ఆందోళనకు దిగారు. వెల్‌లోకి దూసుకెళ్లి నిరసన చేపట్టారు. దీంతో సభాపతి ఓంబిర్లా విపక్ష సభ్యులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెల్‌లోకి వచ్చి ఆందోళన చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. 

 

గాంధీ కుటుంబసభ్యులు సామాన్య వ్యక్తులు కారని, ఇంత అత్యవసరంగా వారికి ఎస్పీజీ భద్రతను ఎందుకు ఉపసంహరించారని కాంగ్రెస్ పక్ష నేత అధీర్ రంజన్ చౌదరి ప్రశ్నించారు. కాంగ్రెస్‌ నేతలను ప్రజలకు దూరంగా ఉంచేందుకు ప్రభుత్వం భద్రత ఉపసంహరించిందని ఆరోపించారు. దీనిపై ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. 

 

కాంగ్రెస్‌ సభ్యులు నినాదాలు చేయడంతో హోంమంత్రి అమిత్ షా సభ నుంచి వెళ్లిపోయారు. అనంతరం కాంగ్రెస్‌ సభ్యులు కూడా అసహనం వ్యక్తం చేస్తూ సభ నుంచి వాకౌట్‌ చేశారు. సోనియాగాంధీ కుటుంబ భద్రతపై స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ కు సీఆర్పీఎఫ్ సంచలన లేఖ రాసింది. సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా, మాజీ ప్రధాని మన్‌మోహన్‌సింగ్, ఆయన భార్య గురుశరణ్ కౌర్‌ల భద్రత కోసం బుల్లెట్ ఫ్రూఫ్ వాహనాలు అందించాలని కోరింది. ఈ నెల 8వతేదీన సోనియాగాంధీ కుటుంబానికి ఎస్పీజీ భద్రతను తొలగించి, జడ్ ప్లస్ కేటగిరి భద్రత ఇచ్చారు. సోనియాగాంధీ కుటుంబానికి ఎస్పీజీ భద్రత ఉన్నపుడు కేటాయించిన టాటా సఫారీ, స్కార్పియో బుల్లెట్ ఫ్రూఫ్ కార్లను వినియోగించేవారు. ఎస్పీజీ భద్రతను తొలగించటంతో బుల్లెట్ ఫ్రూఫ్ వాహనాలను కూడా ఎస్పీజీ ఉపసంహరించుకుంది.సోనియాగాంధీ కుటుంబానికి ఒక్కొక్కరికి వందమంది సాయుధ కమెండోలతో జడ్ ప్లస్ కేటగిరి భద్రత ఉన్న తరుణంలో.. బుల్లెట్ ఫ్రూఫ్ వాహనాలను కూడా సత్వరం అందించాలని సీఆర్‌పీఎఫ్ స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ ను కోరింది.
 

మరింత సమాచారం తెలుసుకోండి: