'మాయమై పోతున్నడమ్మా..మనిషన్నవాడు.. మచ్చుకైనా లేడు చూడూ..మానవత్వం ఉన్నవాడు..' అని ఓ కవి ఆవేదన.. నేడు అక్షరాలా నిజం అవుతోంది. ఎక్కడ చూసినా ఆడవాళ్లపై మృగాల్లా పడి వారి మానాల్ని చీల్చేస్తున్నారు. చిన్నా, పెద్దా.. లేదు, రక్తసంబంధం ఊసు లేదు..  మద్యం మత్తులో జంతువులకూ మనిషికి తేడా లేకుండా కామ దాహంతో రెచ్చిపోతున్నారు. ఆడవాళ్లకి ప్రస్తుత పరిస్థితులు.. ఇంటా, బయటా క్రూరమృగాలు తిరుగుతున్న కారడవుల్లా ఉంటూ భయపెట్టిస్తున్నాయి.

 

 

దేశంలోనూ.. రాష్ట్రంలోనూ ప్రతి రోజూ ఎక్కడో చోట ఈ దారుణ వికృతకాండలు జరుగుతూనే ఉన్నాయి. తొమ్మిది నెలల పసికందులో.. ఎనభయ్యేళ్ళ ముదుసలిలో కూడ తమ కామ చూపుతో కోరలు చాస్తున్న కామ పిశాచాల పైశాచిక చేష్టల్ని ఏం చేస్తే ఆపగలం. తల్లి, చెల్లిని కూడా చెరుస్తూ వావి వరసలు మరిచిపోతున్న సమాజంలో మనిషి పయనం ఎటు పోతుందో కూడా అర్థం కావటం లేదు. కన్న కూతురినే తల్లిని చేసిన ఆ నికృష్ఠపు తండ్రిని ఎలా శిక్షిస్తే ఏం లాభం. తాగిన మైకంలో తల్లినే చెరచబోయిన ఓ కమాంధుడుని ఆ తల్లి నిర్ధాక్షిణ్యంగా చంపటంలో ఎటువంటి పాపం లేదు.. నిర్జీవంగా పడున్న కొడుకుని చూసి ఆ తల్లి కన్నీళ్లు పెట్టటం తప్ప. బస్సుల్లో గ్యాంగ్ రేప్, గుడిలో చిన్నారిపై పైశాచికత్వం.. ఎటుపోతోందీ సమాజం.

 

 

 ఇటువంటి ఘోరాలు నిత్యకృత్యం అయిపోయిన ఈ సమాజంలో ఈతరం బిడ్డలకు బంగారు భవిష్యత్తు ఎలా అందించగలం. వ్యవస్థలో ఎన్ని కఠిన చట్టాలు తెచ్చినా ఇటువంటి మానవ మృగాలకు భయం లేకపోవటమే ఆశ్చర్యం కలిగించే విషయం. ఇంటా, బయటా, స్కూల్, కాలేజ్, ఆటో, బస్.. ఇలా ఎక్కడ చూసినా ఆడవారికి రక్షణ లేకుండా పోతోంది. ఇటువంటి ఘోరమైన అకృత్యాలకు నెలవు కాకుండా ఈ పుణ్య భూమిని ఆ భారతమాతే కాపాడుకోవాలేమో! 

మరింత సమాచారం తెలుసుకోండి: