వివాదాస్ప‌ద నిత్యానంద మ‌రోమారు వార్త‌ల్లో నిలిచారు. ఈ ద‌ఫా కూడా....అమ్మాయిల కోణంలోనే...ఆయ‌న తెర‌కెక్కారు. తనను తానే దేవుడిగా చెప్పుకున్న స్వామి నిత్యానంద...త‌మ‌ కూతుళ్లను త‌మ‌తో కలవనీయడం లేదంటూ బెంగళూరుకు చెందిన ఓ జంట పిటిషన్ వేసింది. స్వామి నిత్యానంద నడుపుతున్న ఆశ్రమంలో తమ కుమార్తెలు నిర్బంధించబడ్డారని, వారిని విడిపించడానికి సహాయం చేయవలసిందిగా కోరుతూ గుజరాత్ హైకోర్టులో పిటిషన్ వేశారు.

 

బాధితులైన‌ జనార్దన శర్మ, ఆయ‌న భార్య  వెల్ల‌డించిన వివ‌రాల ప్ర‌కారం త‌మ నలుగురు కుమార్తెలను 2013లో స్వామి నిత్యానంద నడుపుతున్న ఒక విద్యాసంస్థలో చేర్పించారు. దాదాపు ఆరేళ్ల త‌ర్వాత ఈ ఏడాది తమ కుమార్తెలను అహ్మదాబాద్‌లోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ప్రాంగణంలో ఉన్న నిత్యానంద ధ్యానపీఠానికి చెందిన సర్వగ్యపీఠానికి ఆ అమ్మాయిల‌ను మార్చార‌ట‌. ఈ విష‌య తెలుసుకున్న జనార్దన శర్మ దంపతులు  తమ కుమార్తెలను కలవడానికి వెళ్తే...వారికి షాక్ త‌గిలింది. సర్వగ్యపీఠానికి చెందిన అధికారులు కుమార్తెలను కలవడానికి ఆ దంప‌తుల‌కు అనుమతి ఇవ్వలేద‌ట. దీంతో వారు పోలీసులను ఆశ్ర‌యించి వారి సహాయంతో తమ‌ ఇద్దరు మైనర్ కుమార్తెలను వెనకకు తీసుకురాగలిగారు. కానీ మేజ‌ర్ల‌యిన పెద్ద కుమార్తెలు లోపముద్ర (21) నందిత (18)లు మాత్రం అక్క‌డే ఉండిపోయారట‌. తమతో పంపడానికి ఆ పీఠం అధికారులు నిరాకరించారట‌.

 

దీంతో, వారు గుజరాత్ హైకోర్టులో పిటిషన్ దాఖ‌లు చేశారు. తమ ఇద్దరు చిన్న కుమార్తెలను కిడ్నాప్ చేసి రెండు వారాలకు పైగా అక్రమ నిర్బంధంలో ఉంచారని, పోలీసులు స‌హాయంతోనే వారిని త‌మ ద‌గ్గ‌ర‌కు చేర్చుకున్నామ‌ని పేర్కొంటూ...నిర్భందంలో ఉంచిన తమ పెద్ద కుమార్తెలను కూడా అప్పగించేలా చూడాలని వేడుకున్నారు. త‌మ పిల్ల‌ల వ‌లే..ఇంకెంద‌రో పిల్ల‌లు నిత్యానంద పీఠంలో మ‌గ్గుతున్నార‌ని ఆరోపించారు. పీఠంలో ఉన్న ఇతర చిన్నారులపై కూడా దర్యాప్తు చేయాలని ఆ దంప‌తులు న్యాయ‌స్థానాన్ని కోరారు.

మరింత సమాచారం తెలుసుకోండి: