ఇద్ద‌రు ప్రాంతీయ పార్టీల నేత‌లు...ఇద్ద‌రూ రాజ‌కీయంగా శ‌క్తివంతులే... కానీ వారిద్ద‌రి మ‌ధ్య ఓ పార్టీ చిచ్చుపెట్టింది. అదే భార‌తీయ జ‌న‌తాపార్టీ. తృణ‌మూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మ‌మ‌తా బెన‌ర్జీ కూచ్‌బిహార్‌లో జ‌రిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ, హిందువుల్లో తీవ్రవాదులు ఉన్నట్టుగానే.. మైనార్టీల్లోనూ తీవ్రవాదం పుట్టుకొస్తుందంటూ  పరోక్షంగా భారతీయ జనతా పార్టీతో పాటు ఎంఐఎంపై విమర్శలు చేశారు. బీజేపీ నుంచి ఓ మైనార్టీ రాజ‌కీయ పార్టీ డ‌బ్బులు తీసుకుందని సంచలన ఆరోపణల చేయ‌డ‌మే కాకుండా...అది హైదరాబాద్‌కు చెందిన‌ పార్టీ, బెంగాల్ పార్టీ కాదంటూ వ్యాఖ్యానించారు. బెంగాల్‌లో కొంద‌రు మైనార్టీలు తీవ్రవాదులుగా మారుతున్నారంటూ కామెంట్ చేశారు.

 

స‌హ‌జంగానే దీదీ చేసిన వ్యాఖ్య‌లు రాజ‌కీయాల్లో తీవ్ర చ‌ర్చ‌కు దారితీశాయి. దీంతో బెంగాల్ ముఖ్య‌మంత్రి ఆరోపణలపై ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అస‌దుద్దీన్ ఓవైసీ ఘాటుగానే స్పందించారు. హైద‌రాబాద్‌కు చెందిన కొంద‌రి గురించి దీదీ భ‌య‌ప‌డితే.. సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి 18 స్థానాల్లో ఎలా విజయం సాధించింది అని ప్రశ్నించారు. తమపై మమతా బెనర్జీ విమర్శలు చేస్తున్నారంటే...ఆ రాష్ట్రంలో ఎంఐఎం త‌న ద‌ళాన్ని ఏర్పాటు చేస్తున్నట్టే, పార్టీ బలపడుతున్నట్టేనని వ్యాఖ్యానించారు. మ‌మ‌తా  త‌న భ‌యాన్ని, ఆందోళ‌న‌ల‌ను వ్యక్తం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. ఒక వేళ తన పార్టీ చేస్తున్నది అతివాదమని దీదీ భావిస్తే తానేమీ చేయలేనని చెప్పారు. పశ్చిమ బెంగాల్‌లోకి బీజేపీని ఎంటర్ అయ్యేలా చేయడం, హ్యూమన్ డెవలప్‌మెంట్ ఇండికేటర్స్‌లో ఆ రాష్ట్ర ముస్లింలు వెనకబడిపోవడం లాంటివి మమత విధానాల‌కు నిద‌ర్శ‌న‌మ‌ని ఎద్దేవా చేశారు. ఎంఐఎం పార్టీ ఇటీవ‌ల ప‌లు రాష్ట్రాల్లో జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో పోటీ చేసింది. బీహార్‌లోని కిష‌న్‌గంజ్ అసెంబ్లీ సీటును ఆ పార్టీ గెలుచుకున్న విష‌యం తెలిసిందే. మ‌హారాష్ట్ర‌లో ప్ర‌కాశ్ అంబేద్క‌ర్ పార్టీతో పొత్తు పెట్టుకున్న‌ది. 

 

కాగా, కూచ్‌బీహార్‌లో ఉన్న మ‌ద‌న్ మోహ‌న్ ఆల‌యాన్ని కూడా ఇటీవ‌ల మ‌మ‌తా బెన‌ర్జీ సంద‌ర్శించారు. దీంతో ఆమె హిందూ ఓట‌ర్ల‌ను ఆక‌ర్షిస్తున్న‌ట్లు కూడా విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి. తాజాగా అదే వేదిక‌గా ఎంఐఎంపై విమ‌ర్శ‌లు చేయ‌డం గ‌మ‌నార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: