పాఠాలు చెప్పే బడులంటే గుడితో సమానమంటారు. ఇలాంటి పవిత్రమైన ఆలయంలా భావించే చోట ఇప్పటికే ఎన్నో ఆకృత్యాలు జరుగుతున్నాయి. ఈ మధ్యకాలంలో విద్యార్ధినులపై బోధకుల ఆగడాలు కూడా శృతిమించుతున్నాయి. చదువు పేరిట కొందరు లైంగికంగా వేధిస్తుంటే, మరికొందరు అకారణంగా ఎక్కడో తీయవలసిన కోపాన్ని స్కూల్ పిల్లలమీద ప్రదర్శిస్తున్నారు.

 

 

ఇప్పుడున్న పరిస్దితుల్లో కొందరు ఉపాధ్యాయులు నీతిమాలిన పనులు కూడా చేస్తున్నారు. ఇకపోతే ఓ ఉపాధ్యాయుడి వల్ల నిండు నూరేళ్లూ బ్రతకవలసిన ప్రాణం ఉరితాడుకు బలి అయింది. కన్న వాళ్లకు కడుపుకోత మిగిల్చింది. ఈ ఘటన వివరాలు తెలుసుకుంటే.

 

 

వైఎస్సార్‌ జిల్లా పుల్లంపేటలో ఉపాధ్యాయుడి వేధింపులు తాళలేక ఓ విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. ఈ దారుణ ఘటన జరిగింది మంగళవారం. పోలీసుల కథనం ప్రకారం.. వైఎస్సార్‌ జిల్లా రాజంపేట పట్టణంలో నివసించే కొండపల్లి కృష్ణమూర్తి, గౌరి దంపతులు తమ కుమార్తె లక్ష్మీప్రసన్నను పుల్లంపేటలోని ప్రభుత్వ ఆదర్శ పాఠశాలలో పదో తరగతిలో చేర్పించారు. అక్కడ చదువు విషయమై సైన్సు ఉపాధ్యాయుడు శివ తనను తరచూగా వేధిస్తున్నాడని లక్ష్మీప్రసన్న తన తల్లిదండ్రుల దృష్టికి పలుమార్లు తీసుకెళ్లింది.

 

 

ఈ విషయమై కుమార్తెను ఓదార్చేందుకు విద్యార్థిని తల్లి గౌరి మంగళవారం సాయంత్రం పాఠశాల వద్దకు వచ్చింది. క్లాస్ జరుగుతున్న సమయంలో లక్ష్మీప్రసన్నను చూడటానికి సిబ్బంది అనుమతించకపోవడంతో స్కూల్ ముగిసేవరకు వేచి ఉంది. సాయంత్రం సమయంలో పాఠశాల విడిచిచాక లక్ష్మీప్రసన్నతో మాట్లాడుకుంటూ హస్టల్‌కు వెళ్లారు.. అక్కడికి వెళ్లిన లక్ష్మీప్రసన్న దుస్తులు మార్చుకుంటానని గది లోపలికి వెళ్లి చున్నీతో ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ప్రాణాలు విడిచింది.

 

 

ఈ సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. విద్యార్థిని ఆత్మహత్యపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.  మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఇలాంటి చర్యలకు పాల్పడే ఉపాధ్యాయులపై కఠినమైన చర్యలు తీసుకోవలసిన అవసరం ఎంతైన ఉంది.

 

 

భావితరాలకు బంగారు భవిష్యత్తు నిర్మిస్తున్నామనే భ్రమలో బ్రతుకుతున్న మేధావులు ఒక్క సారి కళ్లు తెరచి చూడండి లోకంలో ఇలాంటి సంఘటనలు ఎన్నో జరుగుతున్నాయి. భావితరాలు బలవంతులుగా  మారడం లేదు. బలహీన పడుతున్నారు. నిజంగా ఇది ప్రమాదకర సూచికనే అంటున్నారు కొందరు. 

మరింత సమాచారం తెలుసుకోండి: