దేశంలో కేవలం పది ఏజెన్సీలకు మాత్రమే ఫోన్లని ట్యాప్‌ చేసే అధికారం ఉన్నదని లోక్‌సభకు కేంద్ర ప్రభుత్వం మంగళవారం తెలిపింది. దేశంలోని పలువురు జర్నలిస్టులు, మానవ హక్కుల కార్యకర్తలకు సంబంధించిన వాట్సప్‌ అకౌంట్లపై కేంద్ర ప్రభుత్వం ఇజ్రాయిల్‌కు చెందిన ఎన్‌ఎస్‌వో గ్రూప్‌కు చెందిన స్పైవేర్‌ పెగసస్‌ను ఉపయోగించి నిఘా పెట్టిందా? అని డీఎంకే నేత దయానిధి మారన్‌ అడిగిన ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌ రెడ్డి పైవిధంగా స్పందించారు.

 

 

అయితే, కేంద్ర సర్కారు స్పైవేర్‌ పెగసస్‌ ద్వారా నిఘా పెట్టిందా? లేదా అనే విషయాన్ని మాత్రం ఆయన వెల్లడించలేదు. ‘దేశ సార్వభౌమత్వాన్ని, సమగ్రతను కాపాడటానికి కేంద్ర ప్రభుత్వం లేదా రాష్ట్ర ప్రభుత్వం దేశంలోని ఏదైనా కంప్యూటర్‌ ద్వారా పంపించిన, సేకరించిన, సృష్టించిన, కంప్యూటర్‌లో నిక్షిప్తం చేసిన సమాచారంపై నిఘా పెట్టొచ్చు అని కిషన్‌రెడ్డి మారన్‌ అడిగిన ప్రశ్నకు లోక్‌సభలో ఈ విధంగా స్పందించారు.

 

 

అలాగే ఈ సమాచారాన్ని అడ్డుకోవడంతో పాటు డిక్రిప్ట్‌ చేసే అధికారం ప్రభుత్వానికి ఉన్నది. సెక్షన్‌ 69, సమాచార, సాంకేతికత చట్టం-2000 దీనికి సాధికారత కల్పిస్తుంది. ఇకపోతే చట్టం నియమ నిబంధనలు, ఎస్‌ఓపీల ద్వారా ఈ సమాచారాన్ని సేకరించేందుకు ప్రభుత్వానికి అధికారం ఉన్నది. అయితే, ఈ పని చేయాలంటే కేంద్ర హోంశాఖ కార్యదర్శి కేంద్ర ప్రభుత్వం అనుమతిని, రాష్ట్రప్రభుత్వం రాష్ట్రహోంశాఖ ప్రధాన కార్యదర్శి అనుమతిని తప్పక తీసుకోవాలి’ అని రాత పూర్వక సమాధానం ఇచ్చారు కిషన్‌రెడ్డి.

 

 

దేశ సార్వభౌమత్వాన్ని, సమగ్రతను కాపాడటం, దేశ భద్రతను కాపాడటం, విదేశాలతో స్నేహపూర్వక సంబంధాలను కొనసాగించడం, ప్రజా ప్రయోజనాలు, పైన పేర్కొన్న అంశాలకు భంగం కలిగించే విషయాలు, నేర విచారణ తదితర సందర్భాల్లో ప్రభుత్వం డిజిటల్‌ సమాచారం సేకరించడం, ఫోన్లను ట్యాప్‌ చేయడం వంటివి జరుగుతాయని ఆయన పేర్కొన్నారు.

 

 

ఇకపోతే ఈ అధికారం కలిగిన పది సంస్థల పేర్లను కూడా ఆయన వెల్లడించారు. అవి ఏంటంటే .. ఇంటలిజెన్స్‌ బ్యూరో, సీబీఐ, ఈడీ(ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌), నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో, సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్ట్‌ ట్యాక్సెస్‌, డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటలిజెన్స్‌, నేషనల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీ, రా (రీసర్చ్‌ అండ్‌ ఎనాలిసిస్‌ వింగ్‌), డైరెక్టరేట్‌ ఆఫ్‌ సిగ్నల్‌ ఇంటలిజెన్స్‌, ఢిల్లీ పోలీస్‌ కమిషనర్‌. మొదలైనవిగా తెలిపారు..

మరింత సమాచారం తెలుసుకోండి: