మహారాష్ట్రలో రాజకీయాలు ఎంతకీ ఓ కొలిక్కి రావటం లేదు. శివసేన కాంగ్రెస్... ఎన్సీపీలతో సంప్రదింపులు జరుపుతూనే ఉంది.  మరోవైపు...ఫిఫ్టీ...ఫిఫ్టీ ఆఫర్‌కు ఒప్పుకుంటే బీజేపీతోనూ జట్టు కట్టడానికి రెడీ అంటూ శివసేన సంకేతాలిస్తోంది. ఫలితంగా మహారాష్ట్రలో సర్కారు ఎవరు  ఏర్పాటు చేస్తారనేది అంతుబట్టకుండా పోయింది.  


మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై ఇంకా అనిశ్చితి వీడలేదు. శివసేనతో జట్టుకట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ముందు  ప్రాథమికంగా ఎన్సీపీ, కాంగ్రెస్‌ పార్టీల మధ్య కొన్ని రోజులు నుంచి చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే శరద్‌ పవార్‌...కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా  గాంధీని సమావేశమయ్యారు. శివసేనతో పొత్తు, ప్రభుత్వ ఏర్పాటులో అనుసరించాల్సిన విధివిధానాలు తదితర అంశాలపై చర్చించేందుకు కాంగ్రెస్‌, ఎన్సీపీ పార్టీల  ముఖ్యనేతలు మంగళవారమే సమావేశం కావాల్సి ఉంది. ఐతే...మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా నిర్వహిస్తోన్న జయంత్యుత్సవాల పనుల్లో కాంగ్రెస్‌ నేతలు తీరికలేకుండా బిజీ అయ్యారు. దీంతో సమావేశం రద్దు చేసినట్లు ఎన్సీపీ నేతలు తెలిపారు. శివసేనతో కలిసి ప్రభుత్వ ఏర్పాటుపై స్పష్టత  ఇవ్వాలంటే ముందుగా కాంగ్రెస్‌, ఎన్సీపీ ఒక అభిప్రాయానికి రావాల్సిన అవసరం ఉందని సోనియాగాంధీతో జరిగిన సమావేశం అనంతరం శరద్‌ పవార్‌  అన్నారు. 


మరోవైపు...పవార్ వ్యాఖ్యలు అర్థం చేసుకోవాలంటే వంద జన్మలెత్తాలని శివసేన నేత సంజయ్ రౌత్ అభిప్రాయపడ్డారు. ఎన్సీపీ,  కాంగ్రెస్‌, శివసేన కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయా? అనే ప్రశ్నకు సోమవారం నాడు శరద్‌పవార్‌ భిన్నమైన సమాధానం ఇచ్చారు. 'బీజేపీ-శివసేన,  ఎన్సీపీ-కాంగ్రెస్‌ వేర్వేరుగా పోటీ చేశాయని అన్నారు. మీరు అలా ఎలా అంటారు? అంటూ నిలదీశారు. బీజేపీ-శివసేన దారి వాళ్లు చూసుకుంటారని  సమాధానం చెప్పారు. తమ రాజకీయాలు తామే చేసుకుంటాం' అంటూ దాటవేత ధోరణిలో జవాబిచ్చారు. ఆ సమయంలో మీడియా శివసేన తాము  పవార్‌తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెబుతోంది కదా? అని అడగ్గా 'నిజమా?' అంటూ పవార్‌ ఎదరు ప్రశ్న వేశారు.

 

ఇక... ఈ నేపథ్యంలో మాట్లాడిన సంజయ్‌రౌత్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. పవార్‌తో తమ పొత్తు గురించి ఎవ్వరూ బెంగ పెట్టుకోవద్దని  కోరారు. డిసెంబరు ఆరంభంలోనే మహారాష్ట్రలో శివసేన సారథ్యంలో స్థిరమైన ప్రభుత్వం ఏర్పాటవుతుందని ధీమా వ్యక్తంచేశారు. అందులో ఎలాంటి  అనుమానాలకు తావులేదని స్పష్టం చేశారు. మీడియానే కాస్త గందరగోళం సృష్టిస్తోందని చెప్పారు సంజయ్ రౌత్. 


మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటు కోసం ఎన్సీపీ, కాంగ్రెస్‌ పార్టీలతో కలిసే ప్రక్రియ ఇంకా కొనసాగుతోందని సంజయ్‌ రౌత్‌ తెలిపారు. ఈ  అంశంలో ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌ వ్యతిరేకమైన వ్యాఖ్యలు చేస్తున్న నేపథ్యంలో పవార్‌ గురించి ఆందోళన చెందక్కర్లేదని ఆయన స్పష్టం చేశారు. మరోవైపు శివసేన డిమాండ్‌ చేస్తున్న ఫిఫ్టీ ఫిఫ్టీ ఫార్ములాకు ఒప్పుకొని ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ ముందుకొస్తే వారితో సంతోషంగా కలుస్తామని పార్టీ  వర్గాలు వెల్లడించాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: