తెలంగాణలో ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణ తప్పెలా అవుతుందని హైకోర్టు ప్రశ్నించింది. రవాణా రంగాన్ని ప్రైవేటీకరించొద్దని ఏ చట్టం చెబుతోందని ప్రశ్నించింది. మరోవైపు తెలంగాణలో ఆర్టీసీ సమ్మె కొనసాగుతుందని జేఏసీ నేతలు ప్రకటించారు. కోర్టు తుది తీర్పు కాపీ అందిన తర్వాతే నిర్ణయం తీసుకుంటామని అంటోంది. మరోవైపు ఈ రోజు భవిష్యత్‌ కార్యాచరణపై ఎన్‌ఎంయూ అత్యవసర భేటీ జరగనుంది.

 

తెలంగాణ ఆర్టీసీ సమ్మె యథాతథంగా  కొనసాగుతుందని జేఏసీ తేల్చిచెప్పింది. కోర్టు తీర్పు కాపీ ఇంకా అందలేదన్న జేఏసీ నేతలు.. అందిన తర్వాత న్యాయనిపుణులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. అంతకు ముందు జేఏసీ మీటింగ్ లో సమ్మెపై కార్మికుల అభిప్రాయాలు తీసుకున్నారు. లేబర్ కోర్టు ఏదొకటి చెప్పేదాకా సమ్మె కొనసాగాల్సిందేనని మెజార్టీ కార్మికులు అభిప్రాయ పడ్డారు.

 

ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. రోడ్డు రవాణా రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటుందని చెప్పింది హైకోర్టు. ఆర్టీసీ, ప్రైవేట్ వ్యవస్థల్ని సమాంతరంరగా నిర్వహించే అధికారం ఉన్నప్పుడు.. క్యాబినెట్ నిర్ణయం తప్పెలా అవుతుందని కోర్టు పిటిషనర్ ను ప్రశ్నించింది. సెక్షన్ 102 ప్రకారం ఎలాంటి మార్పులు చేసినా.. ఆర్టీసీకి సమాచారం ఇవ్వాలన్న పిటిషనర్ తరపు న్యాయవాది వాదించారు. క్యాబినెట్ నిర్ణయం చట్టబద్ధమా..? విరుద్ధమా? అనేది తమ ముందున్న అంశమని హైకోర్టు చెప్పింది. చట్టం ప్రకారం ప్రతిపాదిత మార్పులను గెజిట్‌లో ప్రచురించాలని అభిప్రాయపడింది. స్థానిక పేపర్ లో కూడా ప్రచురించి.. అభ్యంతరాల స్వీకరణకు 30 రోజులు టైమ్ ఇవ్వాలంది. అప్పుడే క్యాబినెట్ నిర్ణయాన్ని చట్టవిరుద్ధమని చెప్పలేమని స్పష్టం చేసింది. ప్రపంచం గ్లోబలైజేషన్ కాలంలో ఉన్నప్పుడు రవాణా రంగాన్ని ప్రైవేటీకరించొద్దని ఏ చట్టమైనా చెప్పిందా అని ప్రశ్నించింది హైకోర్టు. 

 

ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణలో ప్రభుత్వం చట్టపరమైన ప్రక్రియ అనుసరిస్తుందో లేదా తెలియకుండా ఇప్పుడే చట్టవిరుద్ధమని ఎలా అంటామని హైకోర్టు ప్రశ్నించింది. రవాణా రంగంలో ప్రైవేటీకరణ చేయవద్దని ఏ చట్టమైనా చెబుతుందా? అని పిటిషనర్‌ను హైకోర్ట్‌ అడిగింది. ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణ, కార్మికుల ఆత్మహత్యలు, ఆర్టీసీ జీతభత్యాలు తదితర అంశాలపై దాఖలైన పిటిషన్లపై విచారణను హైకోర్టు వాయిదా వేసింది. మరోవైపు ఆర్టీసీ ఎన్‌ఎంయూ అత్యవసర భేటీ ఈ రోజు జరగనుంది. సమ్మె పరిణామాలపై ఎన్‌ఎంయూ నేతలు ఈ సమావేశంలో చర్చించనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: