ఏపీ ప్ర‌భుత్వం, అధికార వైసీపీ ఎంపీల ప్ర‌వ‌ర్త‌న రాజ‌కీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు, మండల, జిల్లా పరిషత్ స్కూళ్లలో 1 నుంచి 10 క్లాసు వరకూ ఇంగ్లిష్ మీడియాన్ని ప్రవేశపెడుతూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సంగ‌తి తెలిసిందే. అయితే, ఈ విష‌యంలో... వైసీపీ నేత‌, నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు వైఖరిపై ఏపీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

 

పార్లమెంటులో ఇంగ్లీష్ మీడియానికి వ్యతిరేకంగా రఘురామకృష్ణంరాజు మాట్లాడటం చ‌ర్చనీయాంశంగా మారింది. దీంతో,  ఎంపీ తీరుపై జిల్లా ఇన్ఛార్జ్ వైవీ సుబ్బారెడ్డితో చర్చించారు. పేద పిల్లల అభ్యున్నతి, భవిష్యత్తు కోసమే ఇంగ్లీష్ మీడియం పెడుతున్న విషయాన్ని గ‌మ‌నించాల్సిందిపోయి...సొంత పార్టీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు వ్యతిరేకంగా మాట్లాడడం జగన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారని స‌మాచారం. ఈ విషయంలో ఎవరు వ్యతిరేకంగా మాట్లాడినా పేద పిల్లల అభ్యున్నతిని అడ్డుకోవమేనన్న ఆయన.. ఎంపీ తీరును వైవి సుబ్బారెడ్డి ముందు ప్రస్తావించారు. ఈ విషయంలో ఎవరు వ్యతిరేకంగా మాట్లాడినా.. పార్టీ పరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఏపీ సీఎం.జగన్ కామెంట్ల నేప‌థ్యంలో...వైవీ సుబ్బారెడ్డి ఎంపీ ర‌ఘురామ‌కృష్ణంరాజుతో మాట్లాడే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది.  అయితే, సీఎం జ‌గ‌న్ అసంతృప్తిపై ఇప్ప‌టివ‌ర‌కు ఎంపీ ర‌ఘురామ కృష్ణంరాజు స్పందించ‌లేదు.

 

ఇదిలాఉండ‌గా, ఏపీలో  2020-21 విద్యా సంవత్సరం నుంచి 1 నుంచి 8 తరగతి వరకూ ఇంగ్లిష్ మీడియం ప్రవేశ పెట్టనున్నట్టు ప్రభుత్వం ఉత్తర్వులు విడుద‌ల చేసిన సంగ‌తి తెలిసిందే.  2021-2022 విద్యా సంవత్సరం నుంచి 9, 10 తరగతుల్లో ఇంగ్లిష్ మీడియం తరగతులుంటాయని పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బి.రాజశేఖర్‌ జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇంగ్లీష్ మీడియంలో క్లాసులు  నిర్వహించిన స్కూళ్లల్లోనూ తెలుగు లేదా ఉర్దూ భాషలను తప్పనిసరి సబ్జెక్టుగా బోధించాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: