మంత్రి అవంతి బాంబు పేల్చారు. బీజేపీ, ఆర్.ఎస్.ఎస్ తో వైసీపీకి దూరం పెంచాలని టీడీపీ కుట్రలు పన్నుతోందంటూ సంచలన ఆరోపణ చేశారు. గత ఎన్నికల్లో బీజేపీతో టచ్‌మీ నాట్ అన్నట్టుగానే వ్యవహరించిన వైసీపీ... ప్రభుత్వంలోకి వచ్చాక కేంద్రంతో సఖ్యతగా వ్యవహరిస్తోంది. ఈ క్రమంలో మంత్రి కామెంట్లు ఏపీ పాలిటిక్స్‌లో కొత్త చర్చకు దారి తీసే సూచనలు కన్పిస్తున్నాయి. అలాగే, ఏపీలో మత రాజకీయాలు కూడా కొత్త టర్న్ తీసుకునే సూచనలు కన్పిస్తున్నాయి. 

 

ఏపీలో రాజకీయం కొత్త టర్న్‌ తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత కొంత కాలంగా వైసీపీతో పాటు సీఎం జగన్‌మోహన్ రెడ్డిని టార్గెట్‌ చేస్తూ హిందువుల మనోభావాలు... సెంటిమెంట్‌ పేరుతో మత రాజకీయం నడుస్తోంది. అయితే  వైసీపీ కూడా దీనికి గట్టిగా కౌంటర్ ఇస్తోంది. ప్రతి అంశాన్ని మతంతో ముడిపెట్టడం సరికాదంటూ విమర్శలు తిప్పి కొట్టే ప్రయత్నం చేస్తోంది వైసీపీ. ఈ క్రమంలోనే మంత్రి అవంతి చేసిన కామెంట్లు ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర చర్చకు తెర లేపాయి.

 

గత ఎన్నికల్లో వైసీపీ, బీజేపీలు విడివిడిగానే పోటీ చేశాయి. కానీ... వైసీపీని బీజేపీ ఒకటేనంటూ ప్రచారం చేసింది టీడీపీ. కానీ... వైసీపీని దెబ్బ తీయాలన్న టీడీపీ ప్రయత్నం ఫలించలేదు. ఆ తర్వాత క్రమంలో కేంద్రంలో బీజేపీ, ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చాయి. రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్‌ ప్రాజెక్టులు, నిధుల కోసం కేంద్రంతో సఖ్యతగా ఉంటోంది వైసీపీ.  

 

ఏపీలోని వివిధ అంశాలపై టీడీపీతో పాటు జనసేన విమర్శలు గుప్పిస్తోంది. ఈ రెండు పార్టీలతో సమానంగానే బీజేపీ కూడా వైసీపీపై విమర్శలతో విరుచుకుపడుతోంది. అయితే టీడీపీ, జనసేనలకు గట్టిగా కౌంటర్ ఇస్తున్న వైసీపీ నేతలు... బీజేపీ విమర్శలపై మాత్రం పెద్దగా స్పందించిన దాఖలాలు లేవు. ఇలాంటి పరిస్థితుల్లో మంత్రి అవంతి కామెంట్లు... ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర చర్చకు తెర లేపాయి.  

 

వైసీపీకి ఎస్సీ, ఎస్టీలతో పాటు ముస్లిం మైనార్టీలే ప్రధాన ఓటు బ్యాంక్‌. అయితే  బీజేపీ విషయంలో వైసీపీ మెతక వైఖరిని పాటిస్తుందనే వాదనకు మరింత బలం చేకూర్చే ఉన్నాయి మంత్రి అవంతి వ్యాఖ్యలు. గత ఎన్నికల్లో వైసీపీ-బీజేపీ ఒకటే అంటూ టీడీపీ చేసిన ప్రచారాన్ని ఓటర్లు పెద్దగా పట్టించుకోకపోయినా... మంత్రి కామెంట్స్‌ వాళ్లను పునరాలోచనలో పడేశాయి. బీజేపీ విషయంలో వైసీపీ సానుకూలంగా ఉందనే విషయాన్ని ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనార్టీలు ఎలా తీసుకుంటారనే ఉత్కంఠకు తెరలేపింది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: