గ‌త కొద్దిరోజులుగా కీల‌క ప‌రిణామాల‌తో వార్త‌ల్లో నిలుస్తున్న శ‌బ‌రిమ‌ల ఆల‌యం మ‌రోమారు అదే రీతిలో...సంచ‌ల‌న ప‌రిణామానికి వేదిక‌గా నిలిచింది. టీటీడీ తరహాలో శబరిమల ఆలయ బోర్డును ఏర్పాటు చేయాల‌ని భార‌త‌దేశ స‌ర్వోన్న‌త న్యాయ‌స్థాన‌మైన సుప్రీంకోర్టు తెలిపింది. ఈ బోర్డు ఏర్పాటు కోసం ప్రత్యేక చట్టం చేయాలని కేరళ ప్రభుత్వానికి సుప్రీం ఆదేశాలు జారీ చేసింది. రెండు నెలల్లో కొత్త చట్టాన్ని కోర్టుకు సమర్పించాలని జస్టిస్‌ ఎన్వీ రమణ ధర్మాసనం ఆదేశించింది.

 

శ‌బ‌రిమ‌ల దేవాల‌యంపై విచార‌ణ సంద‌ర్భంగా టీటీడీ తరహాలో ప్రత్యేక చట్టం ఎందుకు తయారు చేయరని కేరళ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ధర్మాసనం నిలదీసింది. ఈ మేర‌కు చట్టం చేయాలని గతంలో చెప్పినా ఎందుకు అశ్రద్ధ చూపారని కేరళ ప్రభుత్వాన్ని సూటిగా ప్ర‌శ్నించింది. లక్షలాది మంది భక్తులు వెళ్లే అయ్యప్ప ఆలయానికి  ప్రత్యేక చట్టం ఉండాలని జస్టిస్‌ ఎన్వీ రమణ ధర్మాసనం తేల్చిచెప్పింది. టీటీడీ తరహాలో ప్రత్యేకంగా ఐఏఎస్‌ అధికారిని నియమించాలని సూచించింది. కేరళలోని 3000 దేవాలయాలకు ..
ఒకే ఐఏఎస్‌ అధికారిని నియమించడం భావ్యం కాదని సుప్రీంకోర్టు స్ప‌ష్టం చేసింది. అయ్యప్ప దేవాలయాన్ని ప్రత్యేకంగా పరిగణించాలన్న ధర్మాసనం  టీటీడీ తరహాలో శబరిమల ఆలయ బోర్డును ఏర్పాటు చేయాల‌న్న ధ‌ర్మాస‌నం రెండు నెలల్లో కొత్త చట్టాన్ని కోర్టుకు సమర్పించాలని కేర‌ళ ప్ర‌భుత్వానికి డెడ్‌లైన్ విధించింది.

 

ఇదిలాఉండ‌గా, 10 నుంచి 50 ఏండ్ల మధ్య వయసున్న మహిళలను శబరిమల అయ్యప్ప దర్శనానికి అనుమతించరాదన్న నిబంధనను కేరళ పోలీసులు పకడ్బందీగా అమలు చేస్తున్నారు. మంగళవారం పుదుచ్చేరికి చెందిన ఓ బాలిక తన తండ్రితో కలిసి అయ్యప్ప దర్శనం కోసం పంబకు చేరుకుంది. ఆ బాలిక ఆధార్‌ కార్డును పరిశీలించిన పోలీసులు ఆమెకు 12 ఏళ్ల‌ వయసు ఉన్నట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో అయ్యప్ప దర్శనం కోసం కొండ మీదకు వెళ్లడానికి ఆ బాలికను పోలీసులు అనుమతించలేదు. బాలిక తండ్రిని, బంధువులను మాత్రం దర్శనానికి అనుమతించారు. శనివారం శబరిమల అయ్యప్ప ఆలయాన్ని తెరిచిన రోజు కూడా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 10 మంది మహిళలను దర్శనానికి అనుమతించకుండా వెనుకకు పంపిన విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: