వ‌రంగ‌ల్ ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్యే దాస్యం విన‌య్ భాస్క‌ర్ కు నియోజ‌క‌వ‌ర్గంలో నిర‌స‌న‌లు పెరుగుతున్నాయి. త‌మను ఏ మాత్రం ప‌ట్టించుకోవ‌డం లేదంటూ ప్ర‌జ‌లు గ‌గ్గోలు పెడుతున్నారు. అభివృద్ధి ఆమ‌డ దూరంలో నిలిచిపోయింద‌ని చెబుతు న్నారు. దీంతో ఇప్పుడు దాస్యం వ‌ర్గం ఇప్పుడు నియోజ‌క‌వ‌ర్గంలోకి అడుగు పెట్టాలంటేనే బెంబేలెత్తుతోంది. విష‌యం లోకి వెళ్తే.. సుదీర్ఘ రాజ‌కీయ అనుభ‌వం ఉన్న దాస్యం ప్ర‌ణ‌య్ భాస్క‌ర్ సోద‌రుడిగా రాజ‌కీయాల్లోకి వ‌చ్చారు దాస్యం విన‌య్. మొదటిసారి గా హన్మకొండ శాసనసభ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి టీఆర్ ఎస్‌ అభ్యర్థి మందాడి సత్యనారాయణ రెడ్డి చేతిలో ఓడిపోయారు.

 

2005లో టీఆర్ఎస్ పార్టీలో చేరి వరంగల్ అర్బన్ జిల్లా అధ్యక్షుడిగా.. 2005-09 వరకు గ్రేటర్ వరంగల్ మున్సిపాలిటీ లో కార్పొరేటర్ గా, 2009 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి తొలిసారిగా ఎంఎల్ఏ గా గెలిచాడు. తెలంగాణ ఉద్యమ సమయంలో 2010లో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి అదే సంవత్సరం జరిగిన ఉప ఎన్నికల్లో మళ్లీ పోటీ చేసి గెలుపొందాడు. 2014, 2018లో టీఆర్ ఎస్‌ అభ్యర్థిగా వరంగల్ పశ్చిమ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజ‌యం సాధించారు. ఈ క్ర‌మంలోనే కేసీఆర్‌కు స‌న్నిహితుడుగా మారి.. మంత్రి ప‌ద‌విపై ఆశ‌లు పెట్టుకున్నారు. అయితే, విప్ ప‌ద‌వి మాత్రం ఆయ‌న‌ను వ‌రించింది. ఇలా.. మంత్రి అవ్వాల‌నుకుని విప్ అయ్యారు.

 

ఇంత వ‌ర‌కు బాగానే ఉన్నా.. నియోజ‌క‌వ‌ర్గంలో ప్ర‌జ‌ల‌ను మాత్రం దాస్యం ప‌ట్టించుకోవ‌డం లేద‌నే విమ‌ర్శ‌లు జోరుగా వినిపిస్తున్నాయి. ఇప్ప‌టికి రెండు సార్లు తాము గెలిపించినా కూడా త‌మ‌ను ఇప్ప‌టి వ‌ర‌కు ప‌ట్టించుకోలేద‌ని ఇక్క‌డి వారు గ‌గ్గోలు పెడుతున్నారు. కాజీపేట బ్రిడ్జ్‌ పరిస్థితి అలాగే ఉంది. కాజీపేట ఆర్వోబీ కాలపరిమితి అయిపోయినా కూడా శంకుస్థాపనలతో నే కాలాన్ని నెట్టుకుంటూ వస్తున్నారు తప్ప కొత్త బ్రిడ్జ్ పనులు మాత్రం ఇంతవరకు మొదలవ్వలేదు. వరంగల్ పశ్చిమ నియోజక వర్గ ప్రజలకు ఉన్న మిషనరీ హాస్పిటల్, టీబీ హాస్పిటల్లో కనీస సౌకర్యాలు లేక అటు ప్రైవేట్ హాస్పిటల్స్ కి వెళ్లే స్థోమత లేక నానా అవస్థలు పడుతున్నారు.

 

నియోజ‌క‌వ‌ర్గంలోని ఎస్సీ,ఎస్టీ, వసతి గృహాల పరిస్థితి దారుణంగా ఉంది. పేదల కోసం రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా చేప‌ట్టిన‌ డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల మాటే ఈ నియోజ‌క‌వ‌ర్గంలో వినిపించడం లేదు. నాలాలు మోరీల పరిస్థితి చూస్తే చిన్నపాటి చెరువులను తలపిస్తాయి. మ‌రి ఇన్ని స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించాల్సిన ఎమ్మెల్యే దాస్యం మాత్రం ఇప్ప‌టివ‌ర‌కు ప‌ట్టించుకోలేద‌నే విమ‌ర్శ‌లు జోరుగానే వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం. మ‌రి ఇప్ప‌ట‌కైనా ఆయ‌న స్పందిస్తారో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: