సాగ‌ర‌తీరం అయిన విశాఖ‌ప‌ట్నంలో నైజీరియా గ్యాంగ్ ముఠా గుట్టును పోలీసులు ర‌ట్టు చేశారు. అంద‌మైన అమ్మాయిల‌తో వీరు చేస్తోన్న ప్లాన్‌ను పోలీసులు ర‌ట్టు చేశారు. అమ్మాయిలతో అమాయకులకు వల వేసి గిఫ్ట్‌ల పేరుతో మోసం చేస్తున్నట్లు గుర్తించారు. పోలీసుల సమాచారం మేరకు.. నైజీరియాకు చెందిన గ్యాంగ్ కొద్దిరోజులుగా విశాఖలో మోసాలకు పాల్పడుతోంది. వీళ్లు ముందుగా అంద‌మైన అమ్మాయిల ప్రొఫైల్ ఫిక్‌ల‌తో ఫేస్‌బుక్ అక్కౌంట్లు ఓపెన్ చేస్తారు. ఆ త‌ర్వాత వీరు ధ‌న‌వంతులు అయిన వాళ్ల‌ను సెలెక్ట్ చేసుకుని వాళ్ల‌కు ఫ్రెండ్ రిక్వెస్ట్‌లు పెట్టి త‌మ అంద‌మైన వాయిస్‌ల‌తో వాళ్ల‌ను ముగ్గులోకి దించుతున్నారు.

 

అలాగే గిఫ్ట్‌ల పేరుతో ఫేక్ ఫోన్ కాల్స్ చేసి.. మాయ మాటలు చెప్పి నిండా ముంచుతున్నారు. నగరానికి చెందిన ఎంఎంటీసీ రిటైర్డ్ ఉద్యోగికి ఓ మహిళ పేరుతో ఫోన్ కాల్ రాగా.. గిఫ్ట్‌, డబ్బు పంపుతున్నట్లు చెప్పారు. ఆ త‌ర్వాత కొద్ది రోజుల‌కు మ‌ళ్లీ ఫోన్ చేసి పార్సిల్ వ‌చ్చింద‌ని.. ఆ పార్సిల్ ఇవ్వాలంటే కొంత అమౌంట్ చార్జ్ చేస్తార‌ని మ‌ళ్లీ మ‌హిళ నుంచి ఫోన్ కాల్ వ‌స్తుంది. నిజంగానే తనకు గిఫ్ట్ వచ్చిందని నమ్మిన బాధితుడు.. వాళ్లు చెప్పిన అకౌంట్‌కు రూ.లక్షల్లో డబ్బుల్ని ట్రాన్స్‌ఫర్‌ చేశాడు.

 

ఇలా అటు ప‌క్క వ్య‌క్తి అమాయ‌క‌త్వాన్ని బ‌ట్టి రెండు లేదా మూడు సార్లు కూడా ఫోన్ చేసి వాళ్ల అక్కౌంట్‌కు అమౌంట్ ద‌ప ద‌పాలుగా ట్రాన్స్ ఫ‌ర్ చేయించుకుంటారు. ఆ త‌ర్వాత ఎన్నిసార్లు డబ్బు పంపించినా గిఫ్ట్ రాకపోవడంతో.. తాను మోసపోయానని గుర్తించాడు. ఇలా మోస‌పోయిన బాధితులు త‌మ గోడు ఎవ‌రికి చెప్పుకోవాలో తెలియ‌క కిమ్మ‌న్న‌కుండా ఉండిపోయారు.

 

చివ‌ర‌కు ఓ బాధితుడు విశాఖ సైబర్ క్రైమ్ పోలీసుల్ని ఆశ్రయించగా కేసు నమోదు చేశారు. మహిళ ఫోన్‌ చేసిన నంబర్, బ్యాంక్ అకౌంట్ వివరాల ఆధారంగా కేసును దర్యాప్తు చేశారు. ఢిల్లీలో హర్యానాకు చెందిన కిషన్‌లాల్‌, ఇద్దరు నైజీరియన్లు ఈ మోసాలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: