మ‌రో దేశం నుంచి...ఇంకా చెప్పాలంటే...అంద‌రూ అవ‌కాశాల కోసం ఎదురుచూసే అమెరికాలో మ‌రోమారు కొంద‌రు భార‌తీయుల‌కు షాక్ త‌గిలింది. గ‌త అక్టోబ‌ర్ నెల‌లో సుమారు 300 మంది భార‌తీయుల‌ను మెక్సికో నుంచి వెన‌క్కి పంపిన విష‌యం తెలిసిందే. అదే రీతిలో, వీసా నిబంధ‌న‌లు స‌రిగా పాటించ‌క‌పోవ‌డం లేదా అక్ర‌మంగా అమెరికాలోకి ప్ర‌వేశించ‌డం అనే అభియోగాల‌పై 150 మంది భార‌తీయులను అమెరికా త‌మ దే నుంచి డిపోర్ట్ చేసింది. వారు ఇవాళ ఉద‌యం ఢిల్లీ చేరుకున్నారు. 

 

150 మంది భార‌తీయులు వీసా నియ‌మాళిని ఉల్లంఘించి ఉంటారు లేదా అక్ర‌మంగా అమెరికాలోకి చొర‌బ‌డి ఉంటార‌ని అమెరికా అధికారులు గుర్తించారు. ఈ మేర‌కు వారిని స్వ‌దేశానికి పంపించారు.  మాన‌వ అక్ర‌మ ర‌వాణాను ఎట్టి ప‌రిస్థితుల్లో స‌హించేది లేద‌ని యూఎస్ క‌స్ట‌మ్స్ అధికారులు చెప్పారు. మెక్సికోలో ఉండేందుకు డాక్యుమెంట్లు లేని కార‌ణంగానే భారతీయుల‌ను వెన‌క్కి పంపిన‌ట్లు అధికారులు తెలిపారు.  ప్ర‌త్యేక విమానంలో వ‌చ్చిన 150 మంది ఇవాళ ఉద‌యం ఆరు గంట‌ల‌కు ఢిల్లీ విమానాశ్ర‌యంలో దిగారు. బంగ్లాదేశ్ మీదుగా ఆ విమానం వ‌చ్చింది. కాగా, భార‌త‌ ఇమ్మిగ్రేష‌న్ డిపార్ట్‌మెంట్ డాక్యుమెంట్ల‌ను ప‌రిశీలించిన త‌ర్వాత విడుద‌ల చేయ‌నుంది.

 


ఇదిలాఉండ‌గా, దాదాపు నెల‌రోజుల వ్య‌వ‌ధిలోనే...భార‌తీయులు అక్ర‌మ వ‌ల‌స‌దారులుగా స్వ‌దేశానికి రావ‌డం ఇది రెండో సారి. ఇటీవ‌లే మెక్సికో ద్వారా అమెరికాలోకి అక్ర‌మంగా చొర‌బ‌డాల‌ని ప్ర‌య‌త్నించిన 311 మంది భార‌తీయుల‌ను వెన‌క్కి పంపిన విష‌యం తెలిసిందే.  మెక్సికో ఇమ్మిగ్రేష‌న్ అధికారులు వారిని స్వ‌దేశానికి పంపారు. ప్ర‌త్యేక బోయింగ్ 747 విమానంలో బ‌య‌లుదేరిన వారంతా ఢిల్లీ చేరుకున్నారు.

 

ఢిల్లీ చేరుకున్న త‌ర్వాత గౌర‌వ్ కుమార్ అనే భార‌తీయుడు మీడియాతో మాట్లాడుతూ...అమెరికా వెళ్లాల‌న్న ల‌క్ష్యంతో వ్య‌వ‌సాయ భూమిని, బంగారాన్ని అమ్మేసి సుమారు 18 ల‌క్ష‌ల డ‌బ్బును ఏజెంట్‌కు క‌ట్టిన‌ట్లు అత‌ను చెప్పాడు. త‌మ ఏజెంట్ అడ‌వుల నుంచి అమెరికా వెళ్లేందుకు ఏర్పాట్లు చేశాడ‌న్నాడు. సుమారు రెండు వారాల పాటు అడ‌వుల్లో న‌డిచామ‌న్నాడు. మెక్సికో నుంచి అంద‌ర్ని డిపోర్ట్ చేసిన‌ట్లు అత‌ను చెప్పాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: