ఆర్టీసీ సిబ్బంది 47 రోజుల నిరవధిక సమ్మెను విరమించారు. ఆర్టీసీ యూనియన్ల జేఏసి కన్వీనర్ అశ్వత్ధామరెడ్డి మీడియాకు రిలీజ్ చేసిన లేఖలో ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పారు. తమను భేషరతుగా విధుల్లోకి తీసుకోవాలని రెడ్డి డిమాండ్ చేశారు. కార్మికులు, ఉద్యోగులందరూ వెంటనే విధుల్లోకి  చేరాలని కూడా రెడ్డి విజ్ఞప్తి చేశారు.

 

సమ్మెకు ముందున్న పరిస్దితులనే సంస్ధలో కల్పించాలని, సమ్మె ద్వారా సంస్ధను ఇబ్బందుల్లోకి నెట్టటం తమ అభిమతం కాదని రెడ్డి చెప్పారు. 47 వేలమంది సిబ్బందిని విధుల్లోకి చేర్చుకునేందుకు సంస్ధ యాజమాన్యాం, ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరటం ఆశ్చర్యంగా ఉంది.

 

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే సమ్మెను విరమించుకుంటున్నట్లు ప్రకటించటం జేఏసి కన్వీనర్ గా రెడ్డి ఇష్టమే. కానీ విధుల్లోకి చేర్చుకోవాలా ? వద్దా ? అన్నది మాత్రం ఆర్టీసీ యాజమాన్యం ఇష్టం. ఎందుకంటే ఇప్పటికే ఈ విషయంలో కేసియార్ స్పష్టమైన వైఖరిని ప్రకటించేశారు.

 

సమ్మెలో ఉన్న వేలాదిమంది సిబ్బంది సెల్ఫ్ డిస్మిస్ అంటూ ఒకటికి రెండు సార్లు ప్రకటించిన విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది. పైగా ఇన్ని రోజులు సమ్మె చేసిన సిబ్బందిలో ఎవరినీ ఉద్యోగంలోకి తీసుకునే ఆలోచన లేదని కూడా ఆర్టీసి ఎండి కోర్టులోనే స్పష్టం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్ర చేసిన సిబ్బందిని ఉద్యోగంలోకి తీసుకునేది లేదని కూడా చెప్పేశారు.

 

మరి ఈ దశలో తాము సమ్మెను విరమించాం కాబట్టి తమను విధుల్లోకి తీసుకోవాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తే కేసియార్ తీసుకుంటారా ?  చాన్సే లేదని చెప్పవచ్చు. ఉద్యోగులు చేస్తున్న డిమాండ్లలో ఏ ఒక్కదాన్ని కూడా ఆమోదించేందుకు కేసియార్ ఇష్టపడలేదు. కోర్టు జోక్యం చేసుకుని సూచన చేసినా పట్టించుకోలేదు. అలాంటిది ఇపుడు సిబ్బందిని ఉద్యోగంలోకి తీసుకోవటమన్నది కలలోని మాటే. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప మొత్తం సిబ్బందిని విధుల్లోకి చేర్చుకోవటమన్నది జరిగే మాట కాదు.

మరింత సమాచారం తెలుసుకోండి: